హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ) : ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖపాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం శాసనమండలిలో వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో అందెశ్రీ పశువుల కాపరిగా ఎన్నో కష్టనష్టాలు ఓర్చి గీత రచయితగా ఎదిగారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖపాత్ర పోషించిందని తెలిపారు. అందెశ్రీ అకాల మరణంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్తసాయికి డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించినట్టు తెలిపారు. 25 నవంబర్ 2025న ఆర్డినెన్స్-7 ద్వారా ఉద్యోగ నియామకం చేశామని, ఆ రోజు శాసనమండలి సమావేశంలో లేనందున ఈ ఆర్డినెన్స్‌ను సోమవారం అందరితో ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షణీయమని భట్టివిక్రమార్క తెలిపారు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లో తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు సామినేని రా మారావు హత్య కేసు దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారని, నిజమైన హంతకులను పట్టుకోకుండా ఆయన కుటుంబసభ్యులను వేధిస్తూ కేసును పకదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. హత్యా రాజకీయాలపై అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
సామినేని రామారావు హత్యను డిప్యూటీ సీఎం ఖండించినప్పటికీ, ఆ తర్వాత పోలీసులకు వత్తాసు పలుకుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. రైతు ఉద్యమ నాయకుడు సామినేని రామారావును హత్య చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గు మ్మడి నరసయ్య మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రామారావు హంతకులను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు.