ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 94 అద్దె భవనాల్లో, 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమీకృత భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పి మోసగించడంపై అసెంబ్లీ సమావేశాల్లో మొదటిరోజు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించగా ప్రభుత్వంలో చలనం వచ్చింది. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానం ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
పర్యాటకంలో కేరళ రాష్ట్రంతో పోటీపడేలా రాష్ట్ర పర్యాటకాన్ని తీర్చిదిద్దుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి సమాధానం ఇచ్చారు. విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పాయల్ శంకర్, మీర్ జుల్ఫీకర్ అలీ అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. పర్యాటక రంగాన్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు.