మణికొండ, జనవరి 5: తవ్వినకొద్దీ నకిలీపట్టాల పుట్ట కదులుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైయింది. విలువైన సర్కార్ భూముల కబ్జాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరుతో సోమవారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నమస్తే కథనంపై స్పందించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి క్షేత్రస్థాయి అధికారులను పూర్తిస్థాయి నివేధిక సిద్ధంచేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే దీని వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం గండిపేట రెవెన్యూ తహసీల్దారు శ్రీనివాస్‌రెడ్డి.. సమగ్ర సర్వే చేపట్టి నకిలీ పట్టాలను గుర్తించాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. విలువైన సర్కార్ భూములను అధికారుల కళ్లుగప్పి నకిలీపట్టాలను సృష్టించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతుండటంపై రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు..
కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో ఫోర్జరీ సంతకాలతో నాలుగు పట్టాలను గుర్తించిన అధికారులు అదే నిర్మాణాలకు ఆనుకుని ఉన్న మరో 6 నకిలీపట్టాలతోనే నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. వీరంతా నకిలీపట్టాలతో గత తహసీల్దార్‌ను తప్పుదోవ పట్టించి మున్సిపాలిటీ నుంచి అక్రమదారిలో ఇంటి నంబర్లను, అనుమతులను పొంది దర్జాగా నిర్మాణాలు చేపడుతుండటాన్ని చూసి అధికారులు నివ్వెరపోయారు. కోకాపేటలో బరితెగించి కొంతమంది అధికారపార్టీ నాయకులు దాదాపు రూ.25కోట్ల విలువైన సర్కార్ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వేనంబరు 147లో అధికారికంగా కేటాయించిన పట్టాలెన్ని? నిజమైన అర్హులెంతమంది? ఏ కారణం చేత కేటాయింపులు జరిపారనే కోణంలో విచారిస్తున్నారు. ఇంటింటా పర్యటించి పట్టాలను పరిశీలించడమే కాకుండా వాటి కేటాయింపుల రికార్డులను పునఃపరిశీలిస్తామని తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నకిలీవని తేలితే భాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఏస్థాయి వారైనా చట్టపరమైన చర్యలకు భాధ్యులను చేస్తామని అన్నారు.
సూత్రధారులంతా మాజీ ప్రజాప్రతినిధులే..!
సూత్రధారులు చాలా తెలివిగా.. అమాయకులైన నలుగురు యువకుల పేర్లపై పట్టాలను సృష్టించి..దర్జాగా పనులను చేపట్టగా అవన్నీ నకిలీవని తేలడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఆ వ్యవహారంలో తమవారికి సంబంధం లేదంటూ భాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అయితే ఈ నకిలీపట్టాలను సృష్టించడంలో ముగ్గురు మాజీ కౌన్సిలర్లు పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసింది. పట్టాలను సృష్టించి తమ అధికార బలంతో అప్పటి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను తప్పుదోవ పట్టించి నకిలీపట్టాలతో ఇంటి నంబర్ల కేటాయింపులు జరిపారని తెలిసింది. కోకాపేట గ్రామ సర్వే నంర్ 147లో నకిలీపట్టాల బాగోతం వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపింది ఆ ముగ్గురేనని, నాలుగు పట్టాలే కాదు మరో పదకొండు పట్టాలు కూడా నకిలీవేనని స్థానికులు అంటున్నారు.
అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు విషయం బయటకు వస్తుందని అంటున్నారు. మొత్తంగా దాదాపు పదిహేను నకిలీ పట్టాలను సృష్టించి ముందుగా నాలుగు పట్టాలతో పనులను మొదలుపెట్టి..ఆ తర్వాత మరో నాలుగు పట్టాలతో కలిపి ఓ బిల్డర్‌కు డెవలప్మెంట్కు ఇచ్చి దర్జాగా పనులను చేపట్టారు. అవన్నీ నకిలీవంటూ అధికారులు తేల్చినా మాకు అన్ని అనుమతులున్నాయంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి..పనుల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదంటూ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువచ్చారని తెలిసింది. వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ పట్టాలన్నీ నకిలీవని తేలడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసులు..!
విలువైన కోకాపేట భూములల్లో నకిలీపట్టాలను గుర్తించకుండా అప్పటి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన అధికారికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.25కోట్ల విలువైన సర్కార్ భూమిలో అప్పటి జిల్లా కలెక్టర్ హరీశ్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీపట్టాలను గుర్తించకుండా అవన్నీ సక్రమమైనవేనంటూ ధృవీకరించి మున్సిపల్ అధికారులకు సూచించడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసినట్లు తెలిసింది.
ఇంటి నంబర్లను రద్దుచేస్తాం
కోకాపేట గ్రామ సర్వే నంబర్ 147లో నకిలీపట్టాలతో తహసీల్దారు ధృవీకరించినట్లుగా నాలుగు ఇంటి నెంబర్లను గత మున్సిపల్ కమిషనర్ ద్వారా కేటాయింపులు జరిగాయి. వాటిని గండిపేట తహసీల్దారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ లాగిన్ వచ్చిన వెంటనే రద్దుచేస్తాం. అదేవిధంగా మణికొండ, పుప్పాలగూడ గ్రామాల పరిధిలోని 60 గజాల స్థలాలల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందింది. వాటిపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
– కృష్ణమోహన్‌రెడ్డి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్