CPI | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 289 మంది మరణించారని, వందల మంది గల్లంతయ్యారని తెలిపింది. లక్షల మందిని నిరాశ్రయులుగా మార్చిన ఈ ప్రళయం వల్ల వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికీ అనేక మంది శిథిలాల కిందే ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒకరూ మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది. నిత్యావసర వస్తువులు, బట్టలు, ధనం రూపంలో విరాళాలు సేకరించి పార్టీ బ్యాంకు ఖాతాలకు పంపాలని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తమ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులకు విజ్ఞప్తి చేశారు.