శాయంపేట, జూలై 14 : ‘మా నీళ్లు మాకు కావాలి.. మా పొట్టగొట్టి ఎట్ల తీసుకెళ్తరు?’ అంటూ రైతులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథ కం చలివాగు పంప్‌హౌస్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. చలివాగు నుంచి గోదావరి జలాలను ధర్మసాగర్‌కు తరలించొద్దని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 16 ఫీట్లు చలివాగులో నీళ్లు ఉంచిన తర్వాతే మిగతా నీటిని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
రైతులను పంప్‌హౌస్ గేటు వద్దే పోలీసులు, అధికారులు నిలిపివేశారు. దీంతో వాగ్వాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లోపలి నుంచి దేవాదుల డీఈ గణేశ్‌ను బయటకు తీకొచ్చి మాట్లాడించారు. ధర్మసాగర్‌కు నీటి పంపింగ్‌ను నిలిపివేయాలని రైతులు కోరగా, మోటర్లు బంద్ చేయడం కుదరదని డీఈ బదులివ్వడంతో గేటు వద్దే బైఠాయించారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం ఇక్కడి రైతులం భూములు ఇచ్చామని, రెండు పంటలు పండుతాయని ఆశించామని, కానీ ఇకడి పంటలు ఎండబెట్టి ధర్మసాగర్‌కు నీటిని తీసుకెళ్లడం తగదని అన్నారు. ‘మా పొట్టగొట్టి అక్కడి రైతుల కడుపు నింపుతారా?’ అని నిలదీశారు. ఈ క్రమంలో డీఈ గణేశ్ దేవాదుల ఈఈ సునీతతో ఫోన్లో మాట్లాడించారు.
ఇప్పుడు మోటర్లు బందు చేస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి నుంచి ఇబ్బందులు వస్తాయని, 4 రోజుల తర్వాత మోటర్లు ఆపేస్తామని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. తామే లోపలికి వెళ్లి మోటర్లు బంద్ చేసుకుంటామని ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం దేవాదుల ఈఈ సునీత 24 గంటలపాటు చలివాగు పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్‌కు పంపింగ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ధర్మసాగర్‌కు ఎత్తిపోస్తున్న మోటర్‌ను అధికారులు బంద్ చేశారు.