పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైంది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి అన్నీ కలిపితే ఒకెత్తు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టుతో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరందుతుండె. 27 వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. పంపులు, లిఫ్ట్‌లు పెట్టిండ్రు తప్ప చేసిందేం లేదు. అసలు భూసేకరణే చేయలేదు. భూసేకరణ చేయకుండా ఎట్లా పూర్తయితది? రిజర్వాయర్‌లో సమస్యలు అట్లనే ఉన్నయ్. ఇవేం చేయకుండా, రిజర్వాయర్‌లో నీళ్లు నింపగలమా? నీళ్లను ఎత్తి ఎక్కడ పొయ్యాలె?
– సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు (జూన్ 6, 2026)
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు 2023 సెప్టెంబర్‌లో పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ పంప్‌హౌస్‌లో రెండు మోటర్లు ఆన్‌చేసి శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతలను లాంఛనంగా ప్రారంభించిన నాటి సీఎం కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వెట్న్ ద్వారా నార్లాపూర్ పంప్‌హౌస్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎగిసివస్తున్న కృష్ణా జలాలు
బీఆర్ఎస్ను బదనాం చేస్తూ.. ‘నీళ్లు ఎత్తి ఎక్కడ పొయ్యాలె?’ అని ముఖ్యమంత్రి మాట్లాడిన నెలన్నర లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కట్టించిన పాలమూరు ప్రాజెక్టులో.. కేసీఆర్ ప్రారంభించిన పంపుహౌస్‌కు మళ్లీ వెట్న్ నిర్వహించింది. కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లోకే నీటిని ఎత్తిపోసింది. మంగళవారం సాయంత్రం 5.55 గంటలకు ఒక పంపును 19 సెకండ్ల పాటు నడిపింది. తర్వాత 6.20 గంటల నుంచి 7.20 గంటల వరకు గంట పాటు ఏకధాటిగా రన్చేసి రిజర్వాయర్‌లో 0.1 టీఎంసీ నీటిని నింపింది.
2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో దాదాపు రెండున్నరేండ్లుగా పాలమూరును పడావు పెట్టింది. అప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును మిగతా పది శాతం పనులు పూర్తి చేసి రైతులకు నీరందించాలని బీఆర్ఎస్ నిలదీస్తూ వస్తున్నది. మరోవైపు కరువు తరుముకు రావడం, రైతుల్లో నానాటికీ ఆవేదన, ఆగ్రహం పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచింది. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమిది!
హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొల్లాపూర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతలకు ఎట్టకేలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్‌హౌస్ నుంచి నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోతలకు సంబంధించి మంగళవారం సాయంత్రం వెట్న్ నిర్వహించింది. పంపుహౌస్‌లో ఒక మోటర్‌ను ఆన్ చేసి శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని ఎత్తిపోశారు. ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులు నార్లాపూర్ పంప్‌హౌస్‌లో మోటర్ల వెట్న్‌న్రు నిర్వహించేందుకు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు.
సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా విజయవంతం కాలేదు. మంగళవారం మరోసారి ప్రయత్నించి ఎట్టకేలకు విజయవంతంగా ఎత్తిపోతలు నిర్వహించారు. మంగళవారం సరిగ్గా సాయంత్రం 5.55 గంటలకు ఒక పంప్‌ను 19సెకండ్ల పాటు ఆన్ చేశారు. ఆ తర్వాత 6.20 గంటలకు నుంచి 7.20 గంటల వరకు పంప్‌ను ఏకధాటిగా గంట పాటు రన్చేశారు. గంట వ్యవధిలోనే రిజర్వాయర్‌లోకి 0.1టీఎంసీ నీటిని ఎత్తిపోశారు. పంప్‌హౌస్‌లోని మిగతా పంపులను సైతం వెట్న్ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీరందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం 2015లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. 90టీఎంసీల జలాలను ఎత్తిపోయడం ద్వారా పాలమూరులో 12.30లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 1,234 గ్రామాలకు తాగునీరివ్వడం దీని లక్ష్యం. ప్రాజెక్టును 18 ప్యాకేజీలుగా విభజించింది పనులను ప్రారంభించింది. 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 5 రిజర్వాయర్ల(నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్) పనులు దాదాపు పూర్తిచేసింది. ప్రాజెక్టులో నాలుగు చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.
శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే నార్లాపూర్ పంపుహౌస్, అక్కడినుంచి ఏదుల, ఆపై వట్టెం వరకు నీటిని తరలించేందుకు పంప్‌హౌస్‌లను సిద్ధం చేసింది. ఫేజ్-1లో భాగంగా ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు అనుగుణంగా ఆయా పంప్‌హౌస్‌లో 145 మెగావాట సామర్థ్యమున్న మోటర్లు బిగించింది. నార్లాపూర్ పంప్‌హౌస్‌లో రెండు మోటర్లను 2023 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. శ్రీశైలం నుంచి నీటి ఎత్తిపోతలను నార్లాపూర్ రిజర్వాయర్‌ను అట్టహాసంగా లాంఛనంగా ప్రారంభించారు.
దాదాపు 6 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌లోకి నాడు 2 టీఎంసీల మేరకు ఎత్తిపోశారు. నార్లాపూర్ నుంచి ఏదులకు నీటిని తరలించే 8 కి.మీ కాలువలో 2.5 కి.మీ మేరకు కాలువ పనులు మాత్రమే అప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కొద్దిపాటి పనులను పూర్తిచేస్తే నార్లాపూర్ నుంచి కరివెన వరకు జలాలను తరలించేందుకు కావాల్సిన అన్ని పనులు అప్పటికే పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ వచ్చాక ఎక్కడి పనులను అక్కడే పడావు పెట్టింది. కొద్ది పనులను పూర్తిచేయకుండా, నిధులు ఇవ్వకుండా, కనీసం మోటర్లను ఆన్ చేసేందుకు కరెంటు బిల్లులను కూడా చెల్లించకుండా ప్రాజెక్టును పడావు పెడుతూ వస్తున్నది.
కీలకమైన ప్రాజెక్టును పడావు పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు, ఉమ్మడి పాలమూరు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, తదితర ముఖ్యనేతలందరూ ఎప్పటికప్పుడూ నిలదీస్తూ వస్తున్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తదితర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరును ఎండగట్టారు. ప్రాజెక్టు పనులను పూర్తిచేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండాపూర్ వరకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. గులాబీ శ్రేణుల నిలదీతలు, డిమాండ్లతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల స్వయంగా జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించి, ప్రాజెక్టు పనులను సమీక్షించారు.
ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంగానూ సీఎం రేవంత్‌రెడ్డి గత బీఆర్ఎస్పైనే నిందలు మోపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే నికరంగా 26లక్షల ఎకరాలకు నీరు అందేదని, పంపులు, లిఫ్ట్‌లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎదురుదాడికి దిగారు. కానీ ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ ఏర్పాటుచేసిన పంపులనే ప్రారంభించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ సిద్ధమైంది. రెండున్నరేండ్లుగా ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పక్కనపెట్టినట్టు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించింది. అదీగాక ఎల్ నినో నేపథ్యంలో నీటి సంక్షోభం తలెత్తే అవకాశమున్నది. ఇప్పటికీ కృష్ణాబేసిన్‌లో ఒక్క చుక్క వరద రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే అడుగంటింది. ఎగువ నుంచి వరద వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. తాగునీటికి సైతం తండ్లాడే పరిస్థితి వచ్చే అవకాశమున్నది. వాస్తవాలను గ్రహించి, తప్పనిసరి పరిస్థితుల్లో నీటి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకొన్నది. అందులో భాగంగా ప్రస్తుతం పంపులను సిద్ధం చేస్తున్నది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొదటి రిజర్వాయర్ ఎల్లూర్. ఉమ్మడి పాలకులు దాని నీటి నిల్వ సామర్థ్యం అర టీఎంసీగానే నిర్ధారించారు. ఆ రిజర్వాయర్ ఆధారంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అదీగాక కేసీఆర్ ప్రభుత్వం ఎల్లూరు రిజర్వాయర్‌పైనే మిషన్‌భగీరథ ప్లాంట్ ఏర్పాటుచేసింది. ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అత్యవసరం. కానీ దాని సామర్థ్యం అర టీఎంసీ మాత్రమే. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం దూరదృష్టితో ఎల్లూరు రిజర్వాయర్‌కు సమాంతర లెవల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 6 టీఎంసీలతో నార్లాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించింది. అంతేగాక నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్లకు జలాలను తరలించేందుకు మధ్య లింక్ కెనాల్‌ను సైతం ఏర్పాటుచేసింది. ప్రస్తుతం నార్లాపూర్ జలాశయాన్ని నింపితే ఎల్లూరు రిజర్వాయర్‌కు సైతం ఆ జలాలను వినియోగించుకోవచ్చు.
కల్వకుర్తి పంపులన్నీ కలిపినా నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఒక్క పంపుతో సరికావు. దాదాపు నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఒక్కో మోటర్ సామర్థ్యం 145 మెగావాట్లు కాగా, 3వేల క్యూసెక్కులను ఎత్తిపోస్తుంది. నార్లాపూర్ నుంచి కరివెన వరకు జలాలు తరలించడం ద్వారా ఆయా రిజర్వాయర్ల పరిధిలో భూగర్భజల మట్టం పెరుగుతుంది. ఏదుల రిజర్వాయర్ నుంచి పలు తూములను ఏర్పాటుచేసి కల్వకుర్తి కాలువకు సైతం కలిపారు. తద్వారా చెరువులను నింపుకోవచ్చు. ఈ ఉన్న జలాలను ఎత్తిపోస్తే కనీసం తాగునీటికైనా ఢోకా ఉండదు. ఈ పరిస్థితులన్నీ గమనించి, బీఆర్ఎస్ ఒత్తిడితో కాంగ్రెస్ సర్కార్ ఎత్తిపోతలకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.