Asteroid | హైదరాబాద్, జూలై 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): సకల జీవజాలానికి నీరే ఆధారం. సౌర కుటుంబంలో నీళ్లు ఉన్నట్టు గుర్తించిన ఏకైక గ్రహం భూమి మాత్రమే. అయితే, భూమి మీద నీరు ఏర్పడటానికి గల కారణమేంటన్న అంశంపై ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ ఏ ఒక్క అధ్యయనమూ కచ్చితమైన అభిప్రాయాలను వెల్లడి చేయలేదు. అయితే, అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం భూమి మీద నీళ్లు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాలను వెల్లడించారు.
అంగారకుడు(మార్స్), బృహస్పతి గ్రహాల మధ్య గ్రహశకలాల గొలుసు (ఆస్టరాయిడ్ బెల్ట్) ఒకటి ఉంటుంది.
ఆ బెల్ట్‌లో డార్క్ కామెట్స్ (ప్రత్యేకమైన తోకచుక్కలు), 60 శాతం మేర భూమిని పోలిన కొన్ని ఆస్టరాయిడ్లు తిరుగుతూ ఉంటాయి.
వీటిలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.
వేల ఏండ్ల కిందట ఈ డార్క్ కామెట్స్, ప్రత్యేక ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టడంతో కాలక్రమంలో భూమిపై నీరు ఏర్పడిందని, సన్-వాటర్ సైకిల్లో భాగంగా బ్రహ్మాండమైన వానలు పడటంలో నదులు, సముద్రాలు ఏర్పడినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రాబట్టాలంటే లోతైన పరిశోధనలు చేయాల్సి ఉన్నదని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఆస్టర్ టేలర్ తెలిపారు. ఈ వివరాలు ‘ఐకారస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.