జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో 70శాతం సాధారణ ప్రసవాలే చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102కోట్లతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా 56 పరీక్షలు చేసేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మారుమూల పల్లెల్లోనూ రక్త పరీక్షల కోసం నమూనాలను ఇస్తే సాయంత్రంలోగా ఆ ఫలితాలు సెల్‌ఫోన్‌కు వస్తాయని, అల్ట్రా సౌండ్, మెమోగ్రఫీ, టూడీ, ఎకో వంటి పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. పిల్లలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తునామని తెలిపారు. భూపాలపల్లిలో ఈ విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ మొదలవుతుందని, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు ఉంటారని చెప్పారు.
వారంలోగా భూపాలపల్లికి డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తానని తెలిపారు. సీటీ సాన్ మిషన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో ఏఎన్ఎంలు, ఆశాల కోసం 40 సబ్‌సెంటర్ల కోసం రూ.8కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భూపాలపల్లి ప్రాంతంలో ఒక్క పీహెచ్సీ మాత్రమే ఉండేదని, సీఎం కేసీఆర్ వల్ల భూపాలపల్లి జిల్లాకేంద్రం కావడంతో పాటు మెడికల్ కాలేజీ కూడా మంజూరైందని మంత్రి హరీశ్ వివరించారు. పీహెచ్సీ స్థాయి అంటే పది పడకలేనని, ఇప్పుడు మెడికల్ కాలేజీలో 150మంది డాక్టర్లు ఉంటారని, 650 పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పేదలకు మంచి వైద్యం అందుబాటులోకి తేవాలనే ఇదంతా చేస్తున్నట్లు వెల్లడించారు.
సిజేరియన్లు చేస్తే మంచిదా?
గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30శాతమే డెలివరీలు జరిగాయని, తెలంగాణ వచ్చాక 56శాతానికి పెరిగాయన్నారు. 70శాతం నార్మల్ డెలివరీలే చేయాలని సూచించారు. భూపాలపల్లిలో ప్రసవానికి పోతే అవసరం లేకున్నా సీ సెక్షన్ ఆపరేషన్లు చేస్తున్నారని, జిల్లాలో 12 ప్రైవేట్ దవాఖానలు ఉన్నాయని, దాదాపు 650 సీ సెక్షన్ ఆపరేషన్లు, 30మాత్రమే నార్మల్ డెలివరీలు చేశారని, ‘ఇది మంచిదా.. మహిళలకు లాభమా? అనవసరంగా ఎందుకు సీ సెక్షన్ ఆపరేషన్లు చేస్తున్నారు’? అని ప్రశ్నించారు. అవసరం లేకుండా పెద్దాపరేషన్లు చేయడం వల్ల మహిళలకు 35 ఏళ్లకే పనులు చేసుకోలేని పరిస్థితి వస్తుందన్నారు. ఇతర దేశాల్లో 20-30శాతం కూడా సిజేరియన్లు చేయడం లేదని, తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉంటేనే సీ సెక్షన్ ఆపరేషన్లు చేయాలన్నారు. కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో వంద శాతం సీ సెక్షన్ ఆపరేషన్లే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌లో ఆపరేషన్ కోసం రూ.50వేలకు పైనే ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేట్‌కు వెళ్లి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని, డబ్బు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇంకో వరం ఇచ్చారని, ఈ జిల్లాలో రక్తహీనత ఎక్కువ ఉందని, జిల్లాతో పాటు మరో ఎనిమిది జిల్లాల్లో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని నెలరోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు.
గిరిజనుల కల నెరవేర్చిన ఘనత సీఎందే : మంత్రి సత్యవతి
75 ఏళ్ల గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తండాలను స్వయంగా పాలించుకోవాలనే గిరిజనుల కోరికను ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ 3,146 తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులే ఆత్మగౌరవంతో పాలించుకునేలా చేశారని గుర్తుచేశారు. గిరిజన సంక్షేమం కోసం మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బడ్జెట్లో రూ.12,056 కోట్లు కేటాయించుకున్నట్లు వెల్లడించారు. తండా పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిసామని, బీటీ రోడ్లు వేయిస్తామని ప్రకటించారు.
నిలదీయకుంటే మోసపోతం : మంత్రి ఎర్రబెల్లి
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊర కుక్కల్లా మొరుగుతున్నారని, వారిని నిలదీయకపోతే మనం మోసపోతామని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు పిలుపు నిచ్చారు. భూపాలపల్లి అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ దయవల్లేనన్నారు. గత ప్రభుత్వాలు భూపాలపల్లిని పట్టించుకోలేదని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, వాళ్లు పాలించే రాష్ర్టాలు కరంటు కోతలతో అల్లాడుతున్నాయని, ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఎనిమిది క్వింటాళ్ల ధాన్యమే కొంటున్నారని చెప్పారు. పక్క రాష్ర్టాల్లో ధాన్యం కొనరు గాని, ఇకడ కొనాలని మాట్లాడతున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి హరీశ్ రావు నాయకత్వంలో చెరువులు బాగు చేసుకున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు హరీశ్‌రావు ఎన్ని సార్లో వచ్చారో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా కల్యాణలక్ష్మి లాంటి పథకాలను అమలు చేసిందా ఆలోచించాలన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి వచ్చే నెల నుంచి పింఛన్ అందిస్తామని వెల్లడించారు.