మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాలను ఇతివృత్తాలుగా చేసుకొని ఆయన రచించిన అనేక గేయాలు ఎందరి గుండెలనో తట్టాయి. సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి సుమారు పన్నెండేళ్ల ప్రస్థానంలో వెయ్యికి పైగా రాసిన పాటలు.. బతుకమ్మ, జానపద గీతాలు పల్లెపల్లెనా.. గడపగడపనా.. జనాల నోట మార్మోగాయి. ‘కందికొండ’గా సినీ ప్రపంచానికి సుపరిచితుడైన యాదగిరి కొన్ని నెలలుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడువగా ఆయన స్వగ్రామం నర్సంపేట మండలం నాగుర్లపల్లితో పాటు ఉమ్మడి ఓరుగల్లు జిల్లా విషాదంలో మునిగింది. మానుకోటలో మొదలైన ఆయన పాటల ప్రయాణం.. ఎన్నో మదులను తట్టి చివరికి మరిచిపోలేని జ్ఞాపకంలా మిగిలి అనంతలోకాలకు తరలిపోయింది. పల్లె పాటల కంది‘కొండ’ నేలకొరిగిందని తెలిసి ప్రతి పల్లె గుండె కన్నీరుపెట్టింది.
నర్సంపేట రూరల్/ మహబూబాబాద్ రూరల్, మార్చి 12 : ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49) శనివారం మధ్యాహ్నం కన్నుమూశా రు. కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెం దిన యాదగిరి ‘కందికొండ’గా సినీ ప్రపంచానికి సుపరిచితుడు. ఆయన తల్లిదండ్రులు సాంబయ్య- కొమురమ్మ. ముగ్గురు సంతానం (యాదగిరి, శ్రీధర్, ఏలేంద్ర)లో కందికొండ పెద్దవాడు. ప్రాథమిక విద్య సొంత ఊరిలోనే సాగింది. హై స్కూల్ విద్యను నర్సంపేటలో పూర్తి చేశాడు. అప్పటి నుంచే లైబ్రరీకి వెళ్లేవాడు. ఎక్కువగా సినిమాలు చూసేవాడు. దీంతో సాహిత్యం, రచనలవైపు తన ఆలోచనలు మళ్లాయి.
మానుకోట ప్రభు త్వ కళాశాల్లో 1994-96లో ఇంటర్, 1996-98లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే సమయంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాడు. తన గురువులు గోపు సమ్మయ్య, డోలి సమ్మయ్యల ప్రోద్బలంతో పుణెలో జరిగిన జాతీ య స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొని ప్రతిభ చూపి ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. కేసముద్రానికి చెందిన మ హిళను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కందికొండ డి గ్రీ చదివే సమయంలో గూడూరు ప్రాంతానికి చెందిన గేయ రచయిత బూర లక్ష్మణ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సినీ రంగంపై దృష్టిపెట్టాడు. సినీ రం గంలో రాణిస్తూనే మానుకోట శివారులోని కంబాలపల్లికి చెందిన సంగీత దర్శకుడు చక్రీతో కలిసి ఈ ప్రాం తంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం
కందికొండ రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కీమో థెరపీ కారణంగా స్పైనల్ కార్డు దెబ్బతింది. కందికొండ అనారోగ్యం విషయం తెలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సినీ ప్రముఖులు ఆర్థికంగా చేయూతనందించినా ఫలితం దక్కలేదు. పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు.
అనేక పాటల ‘కొండ’..
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కందికొండ అనేక పాటలు రచించారు. ఆయనను తెలు గు చిత్ర పరిశ్రమకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ పరిచయం చేయగా.. దర్శకుడు పూరీ జగన్నా థ్ ఎక్కువగా అవకాశాలిచ్చారు. 143, పోకిరి, ఇడియట్, స్టాలిన్, చక్రం చిత్రాలకు రాసిన పాటలు ఎంతగానో ప్రాచుర్యం పొం దాయి. ‘మళ్లి కూయ వే గువ్వా..మోగిన అందెల మువ్వ’, ‘మనసా ను వ్వుండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పా రుతున్న గో దారిలా’ లాంటి పాటలు ఇప్పటికీ జనుల నోళ్లలో నా నుతున్నాయి. ఆయన రాసిన ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ పాట ఎంతగా పాపులర్ అ యిందో అందరికీ తెలిసిందే.. ‘తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మ.. మా పిడికిట్ల వరి బువ్వ మెతుకురా బతుకమ్మ’, ‘పసుపు కుంకుమ బొట్లందం..ఎలుగుతాంటే దీపాంతం.. పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం’ అం టూ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన రాసిన ఎన్నో పాటలు, జాన పద గేయాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి.
ప్రముఖుల సంతాపం..
కొందికొండ మరణ వార్త వినగానే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. యాదగిరి మృతి తెలంగాణకు తీరని లోటు అని సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతిపై అథ్లెటిక్స్ క్రీడా కారుడు, మా అసోసియేషన్ మానుకోట జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, ప్రజా సం ఘాల నాయకులు, స్నేహితులు సంతాపం తెలిపారు.
నేడు అంతిమ సంస్కారాలు..
కందికొండ పార్థివదేహాన్ని స్వస్థలం నాగుర్లపల్లికి తీసుకొచ్చి నేడు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. కందికొండకు భార్య రమాదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు.
ఆప్తమిత్రున్ని కోల్పోయా..
– వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ గాయకుడు
పోచమ్మమైదాన్ : కందికొండ యాదగిరి మృతి కళారంగానికి తీరని లోటు. పదిహేనేళ్లుగా కలిసి ఉన్న ఆప్తమిత్రుడిని కోల్పోయా. చాలాసార్లు ఇద్దరం కలిసి పాటల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆయన పాటలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండేవి. ఆయన రాసిన సినీ గీతాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి.