ఇన్నాళ్లు మూసి ఉన్న కోచింగ్ సెంటర్లు ‘ఉద్యోగ ప్రకటన’తో మళ్లీ తెరుచుకున్నాయి. కొలువులపై కొండంత ఆశ, ఆత్మవిశ్వాసంతో శిక్షణ కోసం వచ్చి చేరుతున్న యువతతో కేంద్రాలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌కు అడ్డా అయిన నయీంనగర్, కిషన్‌పురాలోని 50 సెంటర్లలో ఎక్కడ చూసినా ఉద్యోగార్థులతో సందడిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త బ్యాచ్‌లు మొదలై పగలు, సాయంత్రం క్లాసులు కొనసాగుతుండగా యువతలో హుషార్ నింపుతున్నాయి. వయో పరిమితి పెంపుతో ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండగా, ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.
– హనుమకొండ చౌరస్తా, మార్చి 12
హనుమకొండ చౌరస్తా, మార్చి 12 : కొలువుల జాతర మొదలవడంతో కోచింగ్ సెంటర్లకు మళ్లీ కళ వచ్చింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురించడమే కాదు కరోనా ఎఫెక్ట్‌తో మూతపడిన కోచింగ్ సెంటర్లకు జీవం పోసినట్లయింది. పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతుండడంతో కొత్త బ్యాచ్‌లు మొదలవుతున్నాయి. నో బ్రేక్ అన్నట్టుగా పగలూ సాయంత్రం జరుగుతున్న క్లాసులతో కోచింగ్ సెంటర్లు సందడిగా మారాయి. అభ్యర్థుల తాకిడి పెరుగడంతో కొత్త కోచింగ్ సెంటర్లూ వెలుస్తున్నాయి. వివిధ శాఖల వారీగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు పరుగు తీస్తున్నారు. ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం.. కేసీఆర్ ప్రకటన యువతలో హుషారు నింపింది. కోచింగ్ సెంటర్లలో కోలాహలం మొదలైంది. ఏజ్ లిమిట్ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌తో పాటు నగరంలో ఉన్న కోచింగ్ సెంటర్లలో ఉద్యోగార్థులు చేరుతున్నారు. వీరి సంఖ్య పెరుగుతుండడంతో కొత్త బ్యాచ్‌లు.. కొత్త సెంటర్లు మొదలవుతున్నాయి. వయోపరిమితి పెంపుతో ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
నాడు వెలవెల.. నేడు కళకళ
కరోనా కారణంగా రెండేళ్లుగా కోచింగ్ సెంటర్లు బోసిపోయాయి. ప్రభుత్వరంగంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లోని సెంటర్లు వెలవెలబోయాయి. ప్రభుత్వం 80వేలకుపైగా ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాలని నిర్ణయించడంతో వాటికి డిమాండ్ మళ్లీ ఏర్పడనుంది. ప్రత్యక్ష శిక్షణ ఇచ్చేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.
అడ్మిషన్లకు బారులు..
కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ కోసం బారులు తీరుతున్నారు. 45-50 రోజుల పాటు శిక్షణకుగాను రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు గతంలో టెట్, డీఎస్సీ, గ్రూప్స్ కోచింగ్ నిమిత్తం రూ.10వేలు వసూలు చేయగా ఇప్పుడు రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సెంటర్‌కు 150 మందికి తగ్గకుండా శిక్షణ ఇస్తామని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 500మంది చేరతారని ఓ సెంటర్ నిర్వాహకుడు చెప్పాడు.
కోచింగ్ సెంటర్ల అడ్డా కిషన్‌పుర..
హైదరాబాద్ అశోక్‌నగర్ తరహాలో హనుమకొండ కిషన్‌పురలో కోచింగ్ సెంటర్లకు అడ్డాగా మారింది. కిషన్‌పుర, నయీంనగర్ ప్రధాన రహదారిలోని రోడ్డుకు ఇరువైపులా అనేక సెంటర్లు దర్శనమిస్తున్నాయి. సుమారు 50వరకు కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. హరీశ్, రామప్ప, విన్నర్స్, సన్‌షైన్, జీనియస్, త్రివేణి ఇనిస్టిట్యూట్.. ఇలా పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లు చాలానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వేలాది మంది ఆయా ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటుంటారు.
జాబ్ పక్కా సాధిస్తా..
మాది సంగెం మండలం పల్లార్గూడ. నేను ఆరు నెలలుగా ఎస్సై, గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. ఉద్యోగ ప్రకటన ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మొన్న సీఎం కేసీఆర్ సార్ చెప్పిన తర్వాత ఉత్సాహం వచ్చింది. ఈ అవకాశం అందిపుచ్చుకుంటా. ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా సాధిస్తాననే నమ్మకం ఉంది. అదే లక్ష్యంతో ప్రిపేరవుతున్నా.
– రాజేందర్, పల్లార్గూడ
ఎస్సై కావాలన్నది నా కల
ఎస్సై కావాలన్నది నా కల. ఇదివరకు మెయిన్స్ వరకు వెళ్లాను. ఈసారి ఎలాగైనా జాబ్ కొడతా. అందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుంటున్నా. సీఎం కేసీఆర్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ ఇస్తుండడం వల్ల కోచింగ్ తీసుకునేందుకు చాలా మంది వస్తున్నారు. వయోపరిమితి పెంపుతో ఈసారి పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
– కార్తీక్, ఎల్కతుర్తి
ఏడాది నుంచి కోచింగ్ తీసుకుంటున్నాం
నేను ఏడాది నుంచి ఎస్సై కోచింగ్ తీసుకుంటున్నా. బీకాం చేశాను. మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. పోలీసు కావాలని ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. ఈసారి పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కోసం ఎంతోమంది కోచింగ్ సెంటర్లకు ఉత్సాహంగా వస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తా.
– మానస, ఎస్సై అభ్యర్థి
పోటీ ఎక్కువగానే ఉంటుంది
ఈసారి ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి అధికంగా ఉంటుంది. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతో ఆశగా ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురుచూశాం. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మొదటిసారిగా కోచింగ్ తీసుకుంటున్నా.
– అపర్ణ, కమలాపూర్
పట్టుదలతో చదువుతున్నారు..
ఉద్యోగాల కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ ఉద్యోగాలు సాధించేందుకు అభ్యర్థులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఈసారైనా ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఉద్యోగాల ప్రకటనతో కోచింగ్ సెంటర్లకు అభ్యర్థులు వస్తున్నారు.
– ఐలి చంద్రమౌళి, రామప్ప పోలీస్ అకాడమీ, హనుమకొండ