తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువే ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. స్థానికతకు పెద్దపీట వేసిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనే కన్ఫ్యూజన్ అక్కర్లేదు. కోచింగ్ లేకుండా సర్కారు కొలువు రాదనే అపోహ అంతకంటే అక్కర్లేదు. కష్టపడి ప్రణాళికబద్ధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం పక్కా అని గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులకు ప్రొత్సాహం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విజేతల అనుభవ పాఠాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఎస్ఐగా పనిచేస్తూనే.. గ్రూప్ 1కు చదువుతున్న..
మాది మెదక్ జిల్లా తూప్రాన్. మేము ముగ్గురం అక్కాచెల్లెల్లం. ఒక తమ్ముడు. మా నాన్నా ఆర్టీసీ డ్రైవర్. 2018లో కానిస్టేబుల్‌గా మనోహరాబాద్ పీఎస్‌లో మొదట పని చేశాను. ఎలాగైనా ఎస్ఐ కావాలనే పట్టుదలతో 2019 సంవత్సరంలో టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎస్సైగా సెలక్టయ్యా. శివ్వంపేటలో శిక్షణ ఎస్సైగా విధులను నిర్వహించి, 2021లో మేడ్చల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టాను. ఇపుడు గ్రూప్ 1కు ప్రిపేరవుతున్నా. కుటుంబ ప్రోత్సాహంతో ఇంకా చదివి ఉన్నత ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నాను. పెండ్లి, కుటుంబం.. ఇవేవీ ఉద్యోగానికి అడ్డుకాదు.
– లావణ్య, మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ
ఇంటి వద్దే చదివా..నాలుగు ఉద్యోగాలొచ్చాయ్..
తెలంగాణ రాష్ట్రం నాకు నాలుగు ఉద్యోగాలు ఇచ్చింది. ప్రతిభ ఉండి, ప్రభుత్వ ఉద్యోగం సాధించే సత్తా ఉన్నా.. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల ప్రకటన పడకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్నా. 2018లో కానిస్టేబుల్ (స్టేట్ ర్యాంక్ 7) ఉద్యోగం రావడంతో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వీఆర్వో పరీక్ష రాసి స్టేట్ ర్యాంక్ 52 సాధించా. గ్రూప్ -4 పరీక్షలో స్టేట్ 92వ ర్యాంకు వచ్చింది. 2020లో గ్రూప్ -2 పరీక్ష రాసి ఎస్ఐ ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్ఆర్నగర్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నా. నేను ఏ కోచింగ్ సెంటర్‌కూ వెళ్లలేదు. ఇంటి వద్దే ఉండి చదివాను.
– చలిగంటి శ్రవణ్‌కుమార్, ఆలగడప, మిర్యాలగూడ మండలం
తెలంగాణ వచ్చాకే.. ఉద్యోగం వచ్చింది
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అల్లం రాజమౌళి -లక్ష్మి దంపతుల కుమారుడు అల్లం రమేశ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రమేశ్ కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, డిగ్రీ వరకు ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న రమేశ్ ఎస్ఐ కావాలనుకున్నాడు. పీఈటీ సార్ లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో కోకో, అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. మరోవైపు కరీంనగర్‌లోని ఓ పోలీస్ అకాడమీలో ఎస్ఐ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నాడు. టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ నోటిఫికేషన్ మెయిన్ పరీక్షలో మంచి మార్కులు పొంది 2019 జూలై 11న ఎస్ఐ జాబ్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
– అల్లం రమేశ్, ఎస్ఐ, కోరుట్ల, జగిత్యాల జిల్లా
రోజుకు 9గంటలు చదివిన.. గ్రూప్ 2 పోస్టు కొట్టిన
నా పేరు ద్యావనపల్లి స్రవంతి. రామరావుపల్లి, మండలం చందుర్తి. మొదటి ప్రయత్నంలోనే నా భర్త ఆయిల్నేని శ్రీనివాస్‌రావు సహకారంతో గ్రూప్-2 ఉద్యోగం సాధించా. పదో తరగతి వరకు మా గ్రామంలోనే చదివా. ఇంటర్ కరీంనగర్‌లోని అల్ఫోర్స్ కళాశాల, డిగ్రీ శ్రీచైతన్య కళాశాల, ఎమ్మెసీ కెమిస్ట్రీ హైదరాబాద్‌లో పూర్తి చేశా. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదలైన మొదటి గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సిద్ధమయ్యా. 2016 నవంబర్‌లో పరీక్షలు రాశా. 2019లో పోస్టింగ్ వచ్చింది. సెక్రటేరియట్లో ఉన్నత విద్య డిపార్ట్మెంట్లో ఏఎస్వో (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా విధుల్లో చేరాను. పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం కూడా వచ్చింది. ఎలాంటి కోచింగ్ లేకుండా రోజు 8 నుంచి 9 గంటలు ప్రిపేర్ అయ్యేదాన్ని. కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.
– ద్యావ స్రవంతి, రామరావుపల్లి, చందుర్తి , మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా
పైసా ఖర్చులేకుండా.. ప్రభుత్వ ఉద్యోగాలు పొందా..
ఖైరతాబాద్: మా ది సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం, పర్సాయపల్లి. వ్యవసాయ కు టుంబం. 7వ తరగతి ఊర్లోనే ప్రభుత్వ స్కూల్లో చదివా. 8 నుంచి పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో, ఇంటర్ హన్మకొండలోని ఎస్వీఎస్ జూనియర్ కళాశాలలో చదివాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 2015లో గ్రూప్-2 పరీక్షలు రాశాను. 2016లో ఎస్ఐగా సెలక్టయి, 2017లో నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టాను. 2020లో గ్రూప్-2లో నాయబ్ తహసీల్దార్‌గా ఎంపికై, ప్రస్తుతం ఖైరతాబాద్‌లో పనిచేస్తున్నాను. ఈ నా ప్రయాణంలో ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీకి పుస్తకాలు, గంథ్రాలయాల నుంచి పుస్తకాలను తెచ్చుకొని చదువుకున్నాను. పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన.
– అనిల్ కుమార్, ఖైరతాబాద్, నాయబ్ తహసీల్దార్
బీటెక్ చదివిన.. ఎక్సైజ్ ఎస్ఐ జాబ్ సాధించిన..
మాది వేములవాడ మండలం రుద్రవరం. మా తండ్రి మంద బాలయ్య, తల్లి భారతి. నేను పదో తరగతి కరీంనగర్‌లోని సిద్ధార్థ హైస్కూల్లో 2007లో పూర్తి చేశా. బీటెక్ హైదరాబాద్‌లో చదివా. మొదటిసారి పంచాయతీ సెక్రటరీగా 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2019 వరకు 6 నెలల పాలు కోనరావుపేట మండలంలో పనిచేశా. తర్వాత 2016 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2019లో ఫలితాలు ప్రకటించగా 2020 జనవరి 23న ఎక్సైజ్ ఎస్ఐగా విధుల్లో చేరా. నేను, మా కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– మంద శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్ఐ, కరీంనగర్ (వేములవాడ టౌన్)