ఆకాశంలో సగమై.. అవనిలో సగమై.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతివలు మగవారికి దీటుగా రాణిస్తున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పాలనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చదువులో.. కొలువులో.. వృత్తిలో.. రాజకీయాల్లో ఇలా ఏరంగంలోనైనా దూసుకెళ్తున్నారు. తల్లిలా.. సోదరిలా.. భార్యలా ఆప్యాయతలు పంచుతూ.. కుటుంబ బంధాలను కాపాడుతూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు ఇలా మన ముందుకు వచ్చారు..
పోచమ్మమైదాన్, మార్చి 7 : వరంగల్ వాసవీకాలనీకి చెందిన నేరెళ్ల శోభావతి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, దివంగత నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి శోభావతి ఎనిమిది పదుల వయస్సు దాటినా మొక్కవోని దీక్షతో పేదలకు అండగా నిలుస్తోంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ, వరంగల్‌లో ఇన్నర్‌వీల్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటులో కీలక భూమిక వహించారు. తెనాలి నుంచి ఓరుగల్లుకు వచ్చిన ఆమె సమాజ సేవకు అంకితమయ్యారు. తనతో పాటు అమెరికాలో ఉన్న స్నేహితుల ద్వారా విరాళాలు సేకరించి సేవలు అందిస్తున్నారు.
1976లో పది మంది సభ్యులతో ఏర్పాటైన ఇన్నర్‌వీల్ క్లబ్ ప్రస్తుతం 58 మంది సభ్యులతో పేదలకు సేవలు అందిస్తున్నది. క్లబ్‌కు తొలి సెక్రటరీగా, ప్రస్తుతం కమ్యూనిటీ హాల్‌కు శాశ్వత అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 1991లో అప్పటి ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు చొరవతో క్లబ్‌కు అనుబంధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టారు. 1992లో దాతలు, ఎన్ఆర్ఐల సహాయంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సహకారంతో వికలాంగులకు కృత్రిమ పరికరాలు అందజేశారు. కమ్యూనిటీ క్లబ్లో ప్రతిరోజు ఉచితంగా యోగా క్లాసులు, పేద విద్యార్థులకు గణితం, ఆంగ్లంలో శిక్షణ కోసం ఇద్దరు మాస్టర్లను నియమించారు. ఇందులో 60 నుంచి 70 మంది విద్యార్థులు పొందుతున్నారు.
40 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నామని, అలాగే సంగీతం, డ్యాన్స్‌లో కూడా మెళకువలు నేర్పిస్తున్నారు. 25 మంది సీనియర్ సిటిజన్స్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రతినెల ఒక వృద్ధాశ్రమానికి రూ.5వేల విలువైన వంట సామగ్రి అందిస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యం కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే ఒక మెడికల్, మరో ఇంజనీరింగ్ విద్యార్థి ఫీజులు చెల్లిస్తున్నారు. ఆటోనగర్‌లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు వేతనాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్లు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందుల పంపిణీ, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందజేశారు. ఇటీవల కొత్తగూడెంలో ఓ గిరిజన ప్రాంతాన్ని దత్తత తీసుకుని నీరు, విద్యుత్, రోడ్డు సదుపాయం కల్పిస్తుస్తున్నారు. అలాగే, అక్కడ పేదల కోసం దవాఖాన నిర్మిస్తున్నామని, దీని కోసం క్లబ్ తరఫున రూ.4లక్షలు, సొంతంగా రూ.లక్ష అందజేసినట్లు శోభావతి తెలిపారు.