వరంగల్, మార్చి 7(నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని, పేద వర్గాల తలరాత మార్చేలా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. దళిత, బహుజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉపయుక్తమైన బడ్జెట్ అని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇది కేసీఆర్ మార్క్ బడ్జెట్. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించటం ద్వారా దళితులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమను చాటుకున్నారు.
త్వరలో సొంత జాగ ఉన్న వారికి కొత్తగా 3 వేల ఇండ్లు రానున్నాయి. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కొత్త పథకం ప్రవేశపెట్టడం శుభపరిణామం. రైతు బంధు తరహాలో నేత కార్మికుల కోసం బీమా పథకం ప్రారంభించాలని బడ్జెట్ సమావేశంలో తెలపడం సంతోషకరం. బడ్జెట్లో రూ.11,728 కోట్లు కేటాయించటం కొత్త పింఛన్‌దారులకు శుభవార్త. పారిశుధ్య కార్మికులకు వేతనం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచేలా నిర్ణయించారు. వరంగల్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయంతో వైద్య విద్య మరింత చేరువైంది. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించారు. ఇంత గొప్ప బడ్జెట్‌ను రూపొందించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.