మహబూబాబాద్, మార్చి 6 : ఆడపిల్లగా పుడి తే తెలంగాణలోనే పుట్టాలనే విధంగా రాష్ట్ర సర్కా రు మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నా రు. మహిళాబంధు వేడుకల్లో భాగంగా తొలిరోజు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల మెటర్నిటీ వార్డులో ఆమె బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. అనంతరం తల్లీబిడ్డలతో సెల్ఫీలు దిగి వారితో కాసేపు ముచ్చటించారు. చిన్నారిని ఎత్తుకుని ఆడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రులకు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 10.32లక్షల మందికి రూ.9వేల కోట్లను పంపణీ చేశారని గుర్తు చేశారు. జిల్లాలో మహిళలకు మెరుగైన వైద్యం అందాలనే మానుకోట దవాఖానను జిల్లా వైద్యశాలగా తీర్చిదిద్దుకున్నామన్నారు.
అదేవిధంగా ఇక్కడి గిరిజన, ఇతర ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడొద్దని జిల్లాకు సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. గర్భిణులకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందించడంతోపాటు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21లక్షల మందికి రూ.450కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆడ శిశువు పుడితే రూ.13వే లు, మగ శిశువు జన్మిస్తే రూ.12వేలతోపాటు కేసీఆర్కిట్లు అందించి సీఎం కేసీఆర్ మహిళలపై ఉన్న మక్కువను చాటుకుంటున్నారని అన్నారు.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1700 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే తెలంగాణలో ‘మహిళాబంధు’ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగావకాశాల్లో మగవారితో సమానంగా అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు శ్రమించిన అన్నిశాఖ మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహిళావైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఏన్ఎంలు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేసీ డేవిడ్, జిల్లా వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ వెంకట్రాములు, డీడబ్ల్యూవో స్వర్ణలతాలెనినా, ఆర్ఎంవో వైదేహి, వైద్యులు పాల్గొన్నారు.