జనగామ, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : జనగామలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ సూపర్ సక్సెస్ కావడం ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణ విభజన ప్రక్రియపై రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ విషం చిమ్మిన తర్వాత ఉద్యమాల చైతన్యగడ్డ నుంచి నరేంద్రమోదీ బీజేపీ సర్కార్‌పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడం క్షేత్రస్థాయి పార్టీ క్యాడర్లో సైతం మరోసారి ఉద్యమస్ఫూర్తిని రగిలించింది. జనగామ వేదికగా కేసీఆర్ బీజేపీ పార్టీపై తన వైఖరిని ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలతో జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి ఊరువాడ ఏకమై తెలంగాణ జెండా పట్టి.. కేసీఆర్‌కు జై కొట్టి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సభాస్థలానికి సమీపంలోని గ్రామాలు, మండల కేంద్రాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు కాలినడకన సైతం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు పొటెత్తారు. కార్యకర్తలు, అభిమానులు సొంత ద్విచక్ర వాహనాలు, సొంత వాహనాల్లో వచ్చి కేసీఆర్‌కు జేజేలు పలికారు. కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలో అడుగుపెట్టిన సీఎంకు లంబాడీ, గుస్సాడీ, కోయ, చిందుయక్ష గానం, ఒగ్గుడోలు వంటి వివిధ కళా రూపాలను ప్రదర్శిస్తుసూ కళాకారులు ఘనంగా ఆహ్వానం పలికారు. మరోపక్క జనగామ బహిరంగ సభ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో అటు నాయకులు, ఇటు గ్రామస్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్ నింపింది.
వరాల జల్లు కురిపిస్తారని..కొత్తగా అభివృద్ధి ఫలాలు ప్రకటిస్తారని ఎప్పటి నుంచో గంపెడాశతో ఎదురుచూసిన జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరే శుభవార్తలు వినిపించడంతో ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఊ అంటే ఢిల్లీ కోటను బద్ధలు కొడుతా’ అంటూ కేసీఆర్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు..‘ప్రాణం పోయినా రైతుల కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టనివ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ కేంద్ర సర్కార్ నిర్ణయంపై కేసీఆర్ ధిక్కారస్వరం వినిపించడంతో సభ ప్రాంగణంలో రైతులు జై కేసీఆర్..జైజై కేసీఆర్..టీఆర్ఎస్ను కాపాడుకుంటాం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
దేవాదులను పూర్వ వరంగల్ జిల్లాకు అంకితం చేసి వచ్చే ఏడాదిలోగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానన్న ముఖ్యమంత్రి హామీపై రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ‘ఎవరికీ ఏకానా ఇచ్చేది లేదు..కాయితం ఇచ్చే పనిలేదు.. దస్త్రం కదిపేది లేదు.. పైరవీ చేసేది లేకుండా’ గుంట భూమి ఉన్న రైతుకు సైతం ఖాతాల్లో రైతుబంధు సాయం.. ఏదైనా కారణంగా రైతు మరణిస్తే వారం రోజుల్లో రూ. 5 లక్షల రైతుబీమా చెక్కు వారి కుటుంబాలకు అందుతుందని కేసీఆర్ అనగానే సభలో జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ నినాదాలు చేశారు. మరోపక్క ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్ధు లు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సభకు తరలివచ్చి కేసీఆర్ చెప్పే మాటలను ఆసక్తిగా విన్నారు.
మెడికల్ కాలేజీ ప్రకటనతో ఊపు..
గత ఎన్నికల సభలో ఇచ్చిన మెడికల్ కళాశాల ఏర్పాటు హామీని జిల్లా సమీక్ష సమావేశం సందర్భంగా జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుర్తుచేసి జిల్లాలో వైద్యవిద్య కళాశాల అవసరం, వనరులు, వసతులను వివరించారు. వేలాది మంది హాజరైన ్లబహిరంగసభా వేదికగా మెడికల్ కాలేజీపై ప్రకటన చేసిన సీఎం రెండు, మూడురోజుల్లోనే జీవో ఇస్తామంటూ క్లారిటీ ఇవ్వడంతో మెడికల్ కాలేజీ కోసం రాద్ధాంతం చేసిన పార్టీలు, సంఘాలు, సంస్థల నోళ్లు మూతపడ్డాయి. దీంతోపాటు పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జనగామ అభివృద్ధిపై సీఎం క్లారిటీ..
ఒకప్పుడు తాగు నీటికి తండ్లాట..సాగునీరు లేక యువకులు వలసలు వెళితే ఊర్లలో వృద్ధులు మాత్రమే కనిపించే వారంటూ బచ్చన్నపేట సంఘటనను ప్రస్తావించిన కేసీఆర్ సాధించుకున్న తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లా ఇకపై గ్రోత్ సెంటర్‌గా మారబోతున్నదన్న సీఎం వ్యాఖ్యలతో రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణి జ్య, పారిశ్రామిక వర్గాల్లో ఆశలు చిగురించాయి. రానున్న రోజుల్లో జనగామ ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సహా హైదరాబాద్-వరంగల్ కారిడార్‌లో ఉన్న జనగామ రాజధాని తర్వాత కీలకం కాబోతున్నదని, ఐటీ, పరిశ్రమలు, విద్యాసంస్థలు తరలివస్తాయి.. హైదరాబాద్‌తోపాటు మరో 32 అభివృద్ధి కేంద్రాలు తయారవుతాయని స్వయంగా సీఎం స్పష్టం చేయడంతో జిల్లాలో రియల్ భూమ్‌కు మరోసారి రెక్కలు వచ్చినట్లయిం ది. కొత్త కలెక్టరేట్లు మంచి ఫలితాలను అందించాలని, రాబో యే రోజుల్లో అభివృద్ధి అద్బుతంఆ ఉంటుందని, ఇతర రాష్ర్టా ల ఆశ్చర్యపోయేలా అభివృద్ధి ఉంటుందని సీఎం స్పష్టం చేయడం..కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు కురిపించడంతో ఉమ్మడి జిల్లా మంరిత అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం అవుతోంది.
‘శభాష్ పోచంపల్లి’.. అభినందించిన సీఎం
జనగామ బహిరంగ సభా వేదిక ఇన్చార్జిగా ఏర్పాట్లను దగ్గరుండి చేయించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భుజంతట్టి అభినందించారు. ‘శభాష్ శ్రీను ఏర్పాట్లు చాలా బాగున్నాయ్.. కష్టపడ్డావ్’ అంటూ ప్రశంసించిన కేసీఆర్‌కు థాంక్యూ సార్.. అంటూ పోచంపల్లి వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.