హనుమకొ ండ చౌరస్తా, నవంబర్ 15 :కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవక్షేత్రా లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఉదయమే ఆలయాలకు వెళ్లి శివుడికి అర్చనలు, అభిషేకాలు చేశారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సహస్ర నాగవల్లి పుష్పాలతో వీరభద్రుడిగా అలకరించి భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. 200 మంది దంపతులకు నమకచమకాదులతో సామూహిక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రదోశకాల సమయంలో తిరిగి రుద్రాభిషేకాలు, ఉత్సవమూర్తి సన్నిధిలో అర్చన కార్యక్రమాలు చేశారు. శివ భక్తులకు జంగా మురళీధర్‌రావు సౌజన్యంతో అన్నప్రసాద వితరణ గావించారు. టీటీడీ సౌజన్యంతో సాయంత్రం 6గంటలకు వంగల సోమయాజులు కార్తీక పురాణ ప్రవచనాలు చెప్పారు. పూజల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంధువులు, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి బంధువులు పాల్గొన్నారు. మంగళవారం ధాత్రినారాయణస్వామి కల్యాణోత్సవం, మహాన్నపూజ, కార్తీక సమారాధన నిర్వహించనున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కాశీవిశ్వేశ్వరాలయంలో..
వరంగల్ చౌరస్తా : వరంగల్ స్టేషన్ రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయంలో ఆలయ ట్రస్టీ ఆకారపు హరీశ్ -స్వాతి దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు లంకా శివకుమార్ ఆధ్వర్యంలో ఉదయం శివలింగానికి పలు రకాల అభిషేకాలు చేశారు. సాయంత్రం ధ్వజస్తంభంపై ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. కాశీవిశ్వేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం 11 కిలోల పెరుగన్నంతో మహా అన్నపూజ, మంగళహారతి నిర్వహించారు. ఈవో ఎన్ వెంకట్రావు ఆధ్వర్యంలో భక్తులు పూజలు చేశారు.
కాశీవిశ్వేశ్వరుడికి పెరుగుతో అభిషేకం
కాశీబుగ్గ : కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథ స్వామి దేవాలయంలో 15 కిలోల పెరుగుతో శివుడికి అభిషేకం చేశారు. తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులతో దేవాలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. కార్యక్రమంలో బయ్య స్వామి, నాగమల్ల పంచాక్షరయ్య, మౌటం శ్రీను, పోశాలు, వెంకన్న, వడిచెర్ల సదానందం, మండల శ్రీరాములు, గోనె జగదీశ్వర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, జోగయ్య పాల్గొన్నారు.
మెట్టుగుట్టపై కార్తీక మాసోత్సవం
మెట్టురామలింగేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకుడు రాగిచేడు అభిలాష్శర్మ స్వామికి ప్రాతఃకాల మహాన్యాసపూర్వక రు ద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు చేశారు. మధ్యా హ్నం మెట్టురామలింగేశ్వరస్వామికి అన్నపూజ నిర్వహించారు. విశేష అలంకరణ చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం 6గంటలకు స్వామివారికి ఆకాశ దీపోత్సవం, ప్రదోషకాల రుద్రాభిషేకం నిర్వహించి విశేషం గా అలంకరణ చేశారు. తదుపరి నీరాజన మంత్రపుష్పాలు, రాజ్యోపచార పూజలు, నక్షత్రహారతి, పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీరస్వామి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్, ధర్మకర్తలు హేమలత, రాజ్‌కుమార్, రవి, రమేశ్, ప్రభాకర్, రాజేందర్, అర్చకులు విష్ణువర్ధనాచార్యులు, సత్యనారాయణశర్మ, భక్తులు పాల్గొన్నారు.
మహా నందీశ్వరుడిగా సిద్ధేశ్వరుడు
హనుమకొండ : పద్మాక్షికాలనీలోని సిద్ధేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు నందీశ్వరుడు, జమ్మిచెట్టు, ఉసిరి చెట్ల ఎదుట దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా సిద్ధేశ్వరుడిని మహానందీశ్వరుడిగా ప్రత్యేకంగా అలంకరించినట్లు అర్చకులు పేర్కొన్నారు.