కరీమాబాద్, నవంబర్ 15: వందశాతం వ్యాక్సినేషన్‌తోనే కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 40వ డివిజన్లో ఎమ్మెల్యే వ్యాక్సినేషన్ తీరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. డివిజన్లలో వందశాతం వ్యాక్సినేషన్ అయ్యేలా సిబ్బంది పని చేయాలన్నారు. ఫస్ట్ డోస్ తీసుకోని వారిని గుర్తించి వారికి తక్షణమే వ్యాక్సిన్ వేయాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నూరుశాతం వ్యాక్సినేషన్ కోసం కలిసికట్టుగా పని చేద్దామని పలుపునిచ్చారు. కార్పొరేటర్ మరుపల్ల రవి సహకారం తీసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సాదుల రంజిత్, మరుపల్ల గౌతమ్, గౌడ రాము, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
టీకాతోనే వైరస్‌ను ఎదుర్కొనగలం..
ఖానాపురం/నర్సంపేట రూరల్/నెక్కొండ/సంగెం: వ్యాక్సిన్‌తోనే కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామని డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్ అన్నారు. ఖానాపురం, కొత్తూరు పీహెచ్‌సీలను ఆయన తనిఖీ చేశారు. ప్రజలు స్వచ్ఛందగా ముందుకొచ్చి టీకాలు వేసుకుంటున్నారని ప్రకాశ్ తెలిపారు. భయపడే వారికి ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాక్సిన్ వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని భోజ్యనాయక్‌తండా, పర్శనాయక్‌తండా, నాగుర్లపల్లిలో సర్పంచ్‌లు భూక్యా లలిత, బానోత్ గాంధీ, కందికొండ రజిత వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయించారు. నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో వ్యాక్సినేషన్‌పై ఎంపీపీ జాటోత్ రమేశ్ సమీక్షించారు. నూరుశాతం వ్యాక్సినేషన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జడ్పీటీసీ లావుడ్యా సరోజనాహరికిషన్, తాసిల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీవో రవి, నెక్కొండ, అలంకానిపేట పీహెచ్‌సీల వైద్యాధికారులు రమేశ్, సుమంత్ పాల్గొన్నారు. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కందకట్ల కళావతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వైద్యాధికారి పొగాకుల అశోక్ మాట్లాడుతూ మండలంలో 31,778 మంది అర్హులు ఉండగా, 30,832 మందికి టీకాలు వేశామన్నారు. మిగిలిన 956 మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీవో కొమురయ్య, హెచ్‌ఈవో సత్యరాజ్, పీహెచ్ఎన్ శాంతమ్మ, హెల్త్ సూపర్వైజర్లు జ్యోతి, రమాదేవి, పాల్గొన్నారు.
ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్
వరంగల్‌చౌరస్తా: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సోమవారం 1117 మందికి మొదటి డోసు, 2458 మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. ఇప్పటి వరకు 2,67,016 మందికి టీకాలు వేయగా, అందులో 1,79,068 మంది మొదటి డోసు, 87,948 సెకండ్ డోస్ తీసుకున్న వారు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 266 గ్రామాలు, 31 కాలనీల్లో నూరుశాతం పూర్తయినట్లు వెల్లడించారు.
15 రోజుల్లో పూర్తి చేయాలి
ఖిలావరంగల్: మరో 15 రోజుల్లో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. సోమవారం ఆయన ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ శాతం తక్కువగా నమోదైన పీహెచ్‌సీల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, నర్సంపేట డీఎల్పీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.