ఐనవోలు నవంబర్ 13 : కేంద్రం ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మండలంలోని ముల్కలగూడెం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్ర రైతులపై కపట ప్రేమ చూపిస్తోందన్నారు. రైతుల పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు కానీ, రైతుల సంక్షేమ కోసం కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు చెప్పుకోడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం యాసంగి పంటను కొనుగోలు చేసే దాకా ఆందోళన చేస్తామన్నారు.
సబ్ సెంటర్ ఏర్పాటు కృషి
కొనుగోలు కేంద్రం పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే అరూరికి వనమాలకనపర్తి రైతులు తమ గ్రామంలో కొనుగోలు సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌తో మాట్లాడారు. సబ్ సెంటర్‌ను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ అరూరి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కొండపర్తి గ్రామస్తులు ఐనవోలు మండల కేంద్రం నుంచి ముల్కలగూడెం, కొండపర్తి, మీదుగా కాజీపేట, హనుమకొండ వరకు బస్సు సర్వీసును నడిపించాలని కోరారు. ఈ మేరకు హనుమకొండ డిపో ఆర్ఎంతో మాట్లాడి, బస్సు నడిపించాలని సూచించారు. దీంతో రూట్ మ్యాప్‌ను పరిశీలించి సర్వీసును ప్రారంభిస్తామని ఆర్ఎం తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, దర్గా సొసైటీ చైర్మన్ వనంరెడ్డి, వైస్ చైర్మన్ మాదాసు బాబు, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, రాజశేఖర్, సర్పంచ్‌లు బండి పర్వతాలు, కట్కూరి రాజమణి, నాయకులు సుధీర్, బెన్సన్, రాజు, లక్ష్మణ్, నారాయణ పాల్గొన్నారు.