వర్ధన్నపేట, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం మండలంలోని కట్య్రాల జీపీ పరిధిలో ఉన్న కల్యాణలక్ష్మి ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మెగా రక్తదాన శిబిరానికి పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట, హనుమకొండ రూరల్, హసన్‌పర్తి మండలాలకు చెందిన 300 మంది యువకులు, టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పని చేస్తున్న యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఎర్రబెల్లి, అరూరి, మార్నేని, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు.
దశాబ్దాల తరబడి వివక్షకు గురైన తెలంగాణ.. ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలోనే సస్యశ్యామలం అవుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలోని కాల్వల్లోకి ఏళ్ల తరబడి చుక్కనీరు రాకపోవడంతో తుమ్మచెట్లు పెరిగినట్లు తెలిపారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు 14 ఏళ్లపాటు కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరూపించాలని డిమాండ్ చేశారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.
తెలంగాణకు తాగునీటి కోసం రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సూచించినా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రైతులు, ప్రజలతో కలిసి పార్టీ శ్రేణులు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో హనుమకొండ జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెలి శ్రీరాములు, వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, సింగ్‌లాల్, కార్పొరేట్ ఇండ్ల నాగేశ్వర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, కట్య్రాల సర్పంచ్ గుజ్జ సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి అరూరి విశాల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.