Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే అని ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కళ్ల ముందు నీళ్లుండి కూడా ఒడిసి పట్టకుండా.. కిందకు విడిచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కకాదా అని మండిపడ్డారు. మీకు ఉరిశిక్ష వేసినా తప్పు లేదని వ్యాఖ్యానించారు.
దేవాదులలో నీళ్లుండి కూడా ఎత్తిపోయడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజీలో 3టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయని తెలిపారు.ఈ రోజు కూడా 22 క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్నారు. అన్నీ ఉండి కూడా నీళ్లెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదులలో నిన్నటివరకు 5 పంపులే నడుస్తున్నాయని తెలిపారు. అసలు మీ సమస్యేంటి అని కాంగ్రెస్ పెద్దలను అడిగారు. చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమే మీ ఆలోచనా అని ప్రశ్నించారు. ఈ కరువు కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిందని అన్నారు.
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లెక్క కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండని హరీశ్‌రావు తెలిపారు. మీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లవ్వడానికి దేవాదుల ప్రాజెక్టు కట్టిందని తెలిపారు. కట్క ఒత్తితే 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మరి కట్క ఒత్తకుండా ఎందుకు వరంగల్ జిల్లా ప్రజలను ఆగం చేస్తున్నారని ప్రశ్నించారు. పోయిన ఏడాది రూ.8కోట్ల మెయింటెనెన్స్ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. దానివల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. గత ఏడాది రూ.800 కోట్ల విలువైన పంటలను ప్రభుత్వం ఎండబెట్టిందని చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినో వస్తుందని సైంటిస్టులు ముందే చెబితే.. సర్కార్ మొద్దునిద్ర పోయిందని మండిపడ్డారు. మెయింటెనెన్స్ చేయరా? రిపేర్లు చేసుకోరా అని ప్రశ్నించారు. కళ్ల ముందు నీళ్లుండి కూడా ఒడిసి పట్టకుండా.. కిందకు విడిచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కకాదా అని మండిపడ్డారు. మీకు ఉరిశిక్ష వేసినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. ఇది చాలా దుర్మార్గమైన పని అని అన్నారు.
దేవాదుల ప్రాజెక్టులోని 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు అని హరీశ్ రావు తెలిపారు. ప్రతిరోజు పావు టీఎంసీ ఎత్తవచ్చని తెలిపారు. అంటే ఇప్పటికి 12 టీఎంసీలు ఎత్తిపోయవచ్చని పేర్కొన్నారు. మరెందుకు 22 రిజర్వాయర్లు నింపలేదని ప్రశ్నించారు. దేవాదుల నుంచి 105 టీఎంసీలు కిందకు తరలిపోయాయని తెలిపారు. ఈ రోజు కూడా దేవాదులలో 78 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు. 73 మీటర్లు ఉంటే చాలు మోటార్లు నడుస్తాయని.. 78 మీటర్లు ఉన్నప్పటికీ మోటార్లు నడిపించడం లేదని చెప్పారు. ఎందుకు నీళ్లు ఎత్తిపోయడం లేదని, ఏమిటీ నిర్లక్ష్యమని ప్రశ్నించారు.
అతి తక్కువ వర్షపాతం పడిన జిల్లా వరంగల్ జిల్లా అని హరీశ్‌రావు తెలిపారు. రెయిన్‌ఫాల్ తక్కువ ఉంటే సమ్మక్క బ్యారేజీ నుంచి నీళ్లు ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఎందుకు నీళ్లను కిందకు జారవిడుస్తున్నారని ప్రశ్నించారు. మేం ప్రెస్‌మీట్ పెట్టగానే.. దేవాదులలో రెండు మోటార్లు స్టార్ట్ చేశారని తెలిపారు. మేం ప్రశ్నిస్తే తప్ప నీళ్లు ఎత్తిపోయారా అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్సాన బాధ్యతాయుత పోరాటం చేస్తున్నామని తెలిపారు.