Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 38.16 టీఎంసీల నీటిని ఎత్తుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. 22 రిజర్వాయర్లు నింపుతామన్నారని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. కానీ వాస్తవమేంటంటే.. మోటర్లే నడవడం లేదని తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం విషయంలో కుంటిసాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. మరి దేవాదుల దగ్గర మీకు ఏం అడ్డమొచ్చిందని ప్రశ్నించారు. అది కూడా నేనే ప్రెస్‌మీట్ పెట్టి హెచ్చరిస్తే తెల్లారి హెలికాప్టర్ వేసుకుని ఉరికిండ్రు అని చెప్పారు. ఇగ అక్కడ నరం లేని నాలుకతో తెగ నరికిండ్రు అని అన్నారు. మంత్రులు ఒకరిని మించి మరొకరు డైలాగులు కొట్టారన్నారు. రేపే మోటార్లు స్టార్ట్ చేస్తామని అన్నారు.. కానీ 8 రోజులైనా ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలేదని చెప్పారు. జోక్ ఏంటంటే.. వీళ్లు పోయిననాడు ఏడు నడిచినయ్.. తెల్లారి నుంచి ఐదు మోటార్లే నడిచాయని తెలిపారు. రేపటి నుంచి పది నడవాల్సిందేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెగ నరికిండ్రు అని విమర్శించారు.
నీళ్ల మంత్రికి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెల్వదని హరీశ్‌రావు విమర్శించారు. 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని డైలాగులు కొట్టారని తెలిపారు. మంత్రి మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో నీళ్లు ఎత్తడం లేదని.. రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని చెప్పారు. నారుమడులన్నీ ముదిరిపోతున్నాయని అన్నారు. మంత్రుల మాటలు నమ్మి నాట్లు వేసుకుంటే పుచ్చిపోయినట్లు అయ్యిందని అన్నారు.