
వరంగల్, నవంబరు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాకు మరోసారి ఎన్ని‘కళ’ వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేయగా, ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దయింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉండదు. వరంగల్ పర్యటనలో భాగంగా మహానగరంలోని వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసేలా సీఎం కేసీఆర్ పర్యటన ఖరారుకాగా తాజా షెడ్యూల్‌తో పర్యటన రద్దయింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు 16న నోటికేషన్ జారీ కానుంది. 23 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. 26న ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. డిసెంబరు 10న పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 2019 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్‌రెడ్డి ఏకపక్షంగా విజయం సాధించారు. పోలైన ఓట్లలో శ్రీనివాస్‌రెడ్డికి 827 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 23 ఓట్లు వచ్చాయి. రికార్డు స్థాయి మెజారిటీతో పోచంపల్లి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఇదే రకమైన ఆధిక్యత నమోదు కానుంది. ఈ ఎన్నికలో ఓటర్లుగా ఉన్న వారిలో టీఆర్ఎస్కు పూర్తి ఆధిక్యత ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించగానే ఈ ఎన్నిక సందడి మొదలుకానుంది.
ప్రజాప్రతినిధుల పరిశీలన
నయీంనగర్/హసన్‌పర్తి : దేవన్నపేట శివారులో విజయగర్జన సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో సభ రద్దు కాగా, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది పార్టీ అధిష్టానం వెల్లడించనుంది.