జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం వల్ల.. హృద్రోగ బాధితులు పెరుగుతున్నారు. 30 ఏండ్లకే గుండె జబ్బులను స్వాగతిస్తున్నారు. ఇలాంటివారు సరైన జీవనశైలిని పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, నడకను దినచర్యలో భాగం చేసుకుంటే.. హృదయం తేలికపడుతుందని అంటున్నారు. రోజూ కనీసం అరగంట వాకింగ్ చేస్తే.. ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.
గుండె జబ్బు వచ్చిందంటే.. వ్యాయామానికి దూరం అవుతుంటారు. కేవలం మందులు, ఆహారంలో జాగ్రత్తలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అనుకుంటారు. వ్యాయామం చేస్తే గుండెపై భారం పడుతుందనీ, ఇట్టే అలసిపోతామని అనుకుంటారు. కానీ, హృద్రోగులకు నడకకు మించిన వ్యాయామం లేదు. మందులు, ఆహారంతోపాటు రోజూ అరగంట నడక వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మొదటి ఐదు నిమిషాలు చాలా నెమ్మదిగా నడవాలి. దీంతో వ్యాయాయానికి శరీరం సిద్ధమవుతుంది. నిదానంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. మళ్లీ వేగాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి. అలాకాకుండా ఒకేసారి నడక వేగాన్ని తగ్గిస్తే.. తలతిరగడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువ వేగంతో తక్కువ దూరం నడవడం కన్నా.. తక్కువ వేగంతో ఎక్కువ దూరం నడిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కడుపు నిండా తిన్న తర్వాత వాకింగ్ చేయడం అంతమంచిది కాదు.
నడక వల్ల గుండె వేగంతోపాటు శ్వాసరేటు క్రమబద్ధంగా పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయులూ పెరిగి.. గుండె, ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. రోజూ అరగంట నడవడం వల్ల రక్తపోటు తగ్గడంతోపాటు, రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కండరాల సామర్థ్యం మెరుగవుతుంది.