న్యూఢిల్లీ, జూన్ 30: నిధులు లేక సతమతమవుతున్న ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ..తాజాగా మరో 23 నగరాల్లో ఈ సేవలను స్టార్ట్ చేసింది. వీటిలో వైజాగ్‌తోపాటు అహ్మదాబాద్, ఆగ్రా, ఔరంగాబాద్, కొచ్చి, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లఖ్నో, మధురై, మలప్పురం, మీరట్, నాగపూర్, నాసిక్, పుణె, రాజ్‌కోట్, సోన్‌పేట్, సూరత్, త్రివేండ్రం, వడొదరలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇప్పటికే సంస్థ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చండీఘడ్, పాట్నాలలో సంస్థ 5జీ సేవలను ప్రారంభించింది.
చిన్న మొత్తాలపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పీపీఎఫ్, ఎన్ఎస్ఈల వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడానికి సర్కార్ మొగ్గుచూపింది. దీంతో వరుసగా ఆరు త్రైమాసికాలుగా వడ్డీరేట్లను ముట్టుకోకపోవడం విశేషం. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. సుఖణ్య సమృద్ధి స్కీంపై 8.2 శాతం వడ్డీని, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్ డిపాజిట్ స్కీంపై 4 శాతం, కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.