తిరుమల : తిరుమల (Tirumala) ,తిరుపతి అభివృద్ధికి విజన్( Vision) -2047ను తయారు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు ( EO Shyamala Rao) అన్నారు. అలిపిరి బేస్ క్యాంప్, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్ వే ల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వివరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టీటీడీ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఫిబ్రవరి 4న రథసప్తమికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ( Utter pradesh) రాష్ట్రంలోని ప్రయాగ రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో గుర్తించేలా అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను త్వరలో ప్రారంభిస్తున్నామని, ఇందుకోసం రూ.70 లక్షల విలువైన రెండు యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళంగా అందించిందని వెల్లడించారు.