ముండ్లు దిగాయి కాళ్లల్లో
పీకేసిన
రక్తం పిండి ఉప్పు కాపడం పెట్టిన
పల్లేరుగాయల
గాయాలెరుగని రోజు లేదు
చేతులకి
గార కంప గీసుకుపోయింది
ఓర్చుకున్నా..
బురద మళ్లల్లో
జలగలు రక్తం పీలుస్తుంటే
పీకి విసిరేసిన
చేన్లల్లో
చెప్పు కింద పాము తలెట్టి
తోక పట్టుకుని గిరగిరా తిప్పి
నేలకేసి కొట్టిన
కావలి కాడ పందుల్ని తరిమిన
కలుపు మొక్కల్ని పీకేసిన
తిండి గింజనిచ్చిన
కొత్త క్రూర మృగమొకటి
కార్పొరేట్ పేరుతో
ఏలికకి చుట్టమై చట్టమై
నన్ను రోడ్లపై కార్లతో
తొక్కించి చంపుతుంటే
ఊరుకుంటానా..!
పండించిన
వరిధాన్యాన్ని కొనబోనంటే
ఊర్కొంటానా
ఉప్పెనై విరుచుకుపడనా..?
నేను కృషీవలుడిని..
అన్నం పెట్టే రైతును..
గిరి ప్రసాద్ చెలమల్లు, 94933 88201