భారత విజయవంతమైన కెప్టెన్ల జాబితా మొదలయ్యేదే అతడి పేరుతో.. సారథిగా అతడి గణాంకాలు పరిశీలిస్తే ఇవి నిజమేనా అనే అనుమానాలు రాకమానవు! బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టినా.. ఫీల్డ్‌లో జట్టును ముందుండి నడిపించినా.. అతడి దూకుడుకు సాటిరాగల మరో ప్లేయర్ లేడంటే అతిశయోక్తి కాదు! ఇటీవలి కాలంలో అతడి బ్యాటింగ్‌లో వాడి తగ్గిందన్న మాట నిజమే అయినా.. సారథిగా 72.65 సగటుతో పరుగులు చేసిన ఏకైక ఆటగాడు అతడే! మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు నేనున్నానని బదులిచ్చింది అతడే! మాస్టర్ మైండ్ మహేంద్రసింగ్ ధోనీ తర్వాత నాయకుడెవరనే ప్రశ్నకు జవాబుగా నిలిచిందీ అతడే! సమకాలిన క్రికెట్లో అభినవ బ్రాడ్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీని కనీసం ఏకవాక్య తీర్మానం కూడా లేకుండానే బీసీసీఐ వన్డే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పిన సమయంలో బోర్డు పెద్దలు వద్దని వారించినా వినలేదనే అక్కసో.. రవిశాస్త్రితో కలిసి అంతా తానై వ్యవహరించాడనే కోపమో.. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీ శకం అర్ధాంతరంగా ముగిసింది! దీన్ని అనుకూలంగా మార్చుకుంటూ జట్టు పగ్గాలు వదిలేశాక సచిన్ టెండూల్కర్ తరహాలో విరాట్ కూడా పరుగుల వరద పారిస్తాడా.. లేక అవమాన భారంతో టెస్టు కెప్టెన్సీకీ ఎసరు తెచ్చుకుంటాడా కాలమే నిర్ణయించాలి!
మాజీ కెప్టెన్ ధోనీ నుంచి కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నప్పుడు అసలు చర్చే జరగలేదు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్రుడు ఓ మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి గైర్హాజరీలో కోహ్లీ జట్టును సరైన దిశలో నడిపించడంతోనే ఇక తన అవసరం లేదనుకున్న ధోనీ.. టెస్టులకు వీడ్కోలు పలికి విరాట్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌ను చేశాడు. పరిమిత ఓవర్ల విషయానికి వస్తే కెప్టెన్సీకి టాటా చెప్పాక కూడా ధోనీ జట్టులోనే కొనసాగడంతో కోహ్లీకి పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. అసలు వీరిద్దరి మధ్య నాయకత్వ బదలాయింపు జరిగిందనే విషయం కూడా చర్చకు రాలేదు. ఎందుకంటే జట్టుకు విరాట్ సారథ్యం వహిస్తున్నా.. యువ ఆటగాళ్లకు వికెట్ల వెనుక నుంచి మార్గనిర్దేశం చేసింది మాత్రం ధోనీనే. దీంతో ఆటగాళ్లతో పాటు విశ్లేషకులపైనా దీని ప్రభావం పెద్దగా పడలేదు. కానీ గత రెండేండ్లుగా కోహ్లీ ప్లేయర్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటి తరుణంలో అతడి కంటే ముందే జట్టులోకి వచ్చినా.. చాన్నాళ్ల వరకు నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డ రోహిత్‌కు పగ్గాలు అప్పగించడం మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారింది.
ఐసీసీ టోర్నీల వల్లే..
విదేశీ పర్యటనలు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రికార్డులు బద్దలు కొడుతూ.. పరుగుల వరద పారించే పరుగుల యంత్రం విరాట్.. ఐసీసీ టోర్నీలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. దశాబ్ద కాలంలోనే 20 వేల అంతర్జాతీయ పరుగులను తన పేరిట రాసుకున్న కోహ్లీ.. సారథిగా 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆకట్టుకోలేకపోయాడు. దురదృష్టం కొద్ది ఈ నాలుగు మెగా టోర్నీల్లోనూ భారత్ విజేతగా నిలువలేకపోవడంతో.. అంతకుముందు కోహ్లీ సాధించిన విజయాలు ఈ పరాజయాల ముందు చిన్నబోయాయి. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించిన విరాట్.. వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదని భావించిన సెలెక్టర్లు వైట్‌బాల్ క్రికెట్లో కోహ్లీ ఆధిక్యాన్ని తగ్గిస్తూ.. టీ20, వన్డేలకు రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
వద్దన్నందుకే!
తన కంటే వయసులో పెద్దవాడైన రోహిత్ శర్మను కాకుండా.. లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్‌లో ఒకరిని వైస్ కెప్టెన్‌గా నియమించి.. భవిష్యత్తు కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని కోహ్లీ ముందు నుంచి కోరుకుంటూ వస్తున్నాడు. ఈ అంశాన్ని గతంలో బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో కావాలనే రోహిత్‌ను పక్కన పెడుతున్నాడనే వార్త గుప్పుమంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ అసమాన రీతిలో ఐదు శతకాలతో విజృంభించినా.. జట్టు ఫైనల్‌కు చేరకపోవడంతో అప్పుడే కెప్టెన్సీ మార్పు గురించి చర్చ జరిగినా.. బోర్డు అప్పట్లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా నిరాశజనక ప్రదర్శన చేయడం.. ఆ తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేయడం.. అదే సమయంలో సొంతగడ్డపై రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ నెగ్గడంతో కొత్త సారథి ఎంపిక అనివార్యమైంది! కోహ్లీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్తున్నా.. రెండు రోజుల గడువు ఇచ్చి గౌరవంగా వన్డే పగ్గాలు వదిలేయమని విరాట్‌కు సూచించినట్లు ప్రచారం సాగుతున్నది. ఏదేమైనా భారత వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ సారథ్యం ముగిసిపోయింది. ఈ అవమానాలను అధిగమించి విరాట్ మరికొన్నాళ్ల పాటు తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు!
క్రికెటేతర కారణాలు!
మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో పరుగులు సాధించిన విరాట్.. నిజానికి ఇటీవలి కాలంలో విఫలమవుతున్నాడని గట్టిగా చెప్పలేం! కాకపోతే గతంలో మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రెండేండ్లలో ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు! దీంతో రన్‌మెషీన్ నెమ్మదించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంలో మాత్రం వ్యక్తిగత ప్రదర్శన కాకుండా.. క్రికెటేతర అంశాలే ప్రధాన కారణమయ్యాయనే చర్చ బలంగా నడుస్తున్నది. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడిని అమర్యాదపూర్వకంగా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించడంలో కోహ్లీనే కీలకంగా వ్యవహరించడనేది బహిరంగ రహస్యమే కాగా.. రవిశాస్త్రితో కలిసి బోర్డు సూచనలు లెక్కచేయకుండా అన్నీ తానై వ్యవహరించాడనే వాదన కూడా ఉంది. దీంతోనే శాస్త్రి గడువు ముగిసి మూడు నెలలు కాకముందే విరాట్ పగ్గాలు వదులుకోవాల్సి వచ్చింది.
జట్టుకు కోహ్లీ ఎంతో అవసరం: రోహిత్
జట్టుకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ ఎప్పటికీ అవసరమని వన్డే కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ జట్టును ఎన్నోసార్లు గట్టెక్కించాడని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానల్‌తో గురువారం రోహిత్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ లాంటి నాణ్యమైన బ్యాటర్ ఎల్లప్పుడూ జట్టుకు అవసరం. టీ20 ఫార్మాట్లో సగటు 50కి పైగా ఉండడం అసాధారణ విషయం. కష్ట సమయాల్లో కోహ్లీ ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. అతని అనుభవం.. జట్టుకు దోహదం చేస్తుంది. ఒక కెప్టెన్ సరైన ఆటగాళ్లను ఎంపిక చేయాలి. ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇస్తా. బయటికన్నా నా పాత్ర అంతర్గతంగా ఎంతో అవసరం. ఫీల్డ్‌లో ఉంటే మూడు గంటల పాటు 11 మంది ఆట మాత్రమే చూడాలి. అక్కడ ఎక్కువ మార్పులు చేయలేం. కెప్టెన్‌గా 20 శాతం ఫీల్డ్‌లో.. 80 శాతం బయట చూసుకోవాలి. జట్టుకు వెన్నెముకగా నిలవడం ఎంతో అవసరం’ అని తెలిపాడు.
ధన్యవాదాలు కోహ్లీ: బీసీసీఐ
న్యూఢిల్లీ:కనీసం పేరు కూడా ప్రస్తావించకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించిన బోర్డు.. అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అతడి సేవలకు ధన్యవాదాలు చెబుతూ గురువారం బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘గొప్ప సంకల్పం, అభిరుచితో దూకుడుగా జట్టును నడిపించిన నాయకుడికి ధన్యవాదాలు’ అని అందులో పేర్కొంది. వన్డే ఫార్మాట్లో 95 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ.. అందులో 65 మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలందించాడు. 70.43 విజయాల శాతంతో 50 మ్యాచ్‌లకు పైగా జట్టుకు నాయకత్వం వహించిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.