చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్‌కు తగినంత మెజారిటీ లభించలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో వీసీకే, సీపీఐ, సీపీఎం మద్దతును టీవీకే కోరింది. (Vijay) విజయ్ స్థాపించిన టీవీకే ఎన్నికల్లో 108 సీట్లు మాత్రమే సాధించింది. తన ఐదుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీంతో 112 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌తో ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ను విజయ్ కలిశారు.
కాగా, తమిళనాడు గవర్నర్‌ను విజయ్ రెండుసార్లు కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మెజారిటీ మార్కు చూపించాలని గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు ఇంకా కనీసం ఆరుగురు శాసనసభ్యుల మద్దతు అవసరం. దీంతో వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నిస్తున్నది.
మరోవైపు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం నేతలతో గురువారం సమావేశమయ్యారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలు మే 8న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నాటికి స్పష్టత రానున్నది.