– తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు
– బీఆర్ఎస్ దేవరకొండ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి
దేవరకొండ, ఏప్రిల్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా తుడిచిపెట్టిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ.94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి.మీ కెనాల్స్, పిల్ల కాలువలు, విజయవంతంగా కేసీఆర్ నిర్మించారని టీవీఎన్ రెడ్డి గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. కేవలం కేసీఆర్ ను బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా మరమ్మతులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని తీసుకోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.