Elections 2026 : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ముగిశాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 82 శాతానికిపైగా, పశ్చిమ బెంగాల్లో 89 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఇవి మొదటిదశ ఎన్నికలు మాత్రమే. మరో దశ ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయి.
రెండు రాష్ట్రాల్లో ఇంకా ఓటింగ్ కొనసాగుతోంది. దీంతో ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీని ప్రకారం తుది ఓటింగ్ వెలువడటానికి మరింత సమయం పడుతుంది. తమిళనాడుకు సంబంధించి మొత్తం 234 స్థానాలకు ఒకేసారి గురువారం ఎన్నిక జరిగింది. ఈ రాష్ట్రంలో 5.7 కోట్ల మంది ఓటర్లున్నారు. డీఎంకే కూటమి, ఏఐఏడీంకే కూటమి, టీవీకేలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలి దశలో గురువారం 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల బెంగాల్లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. పలుచోట్ల టీఎంసీ నేతలు.. ఇతర పార్టీలవారిపై దాడులు చేశారు. కార్లు, ఆస్తులు ధ్వంసం చేశారు.
ఒక బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ నేతలు దాడికి పాల్పడ్డారు. ముర్షీదాబాద్ పరిధిలో నాటు బాంబులు కూడా విసురుకున్నారు. కేంద్ర బలగాల భారీ భద్రత మధ్య బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య గట్టిపోటీ నెలకొంది. బెంగాల్లో రెండో దశ ఎన్నిక జరిగే ఏప్రిల్ 29న సాయంత్రం 6.30 గంటలకు వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి.