లక్నో, జూలై 29: ఉత్తరప్రదేశ్ మీరట్‌లో ప్రభుత్వ వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిపే ఘటన ఒకటి వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానకు చేరిన బాధితుడు, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడు. భుజాన చంటిబిడ్డతో బాధితుడి భార్య ప్రాధేయపడుతున్నా వైద్యుడు నిద్ర నుంచి లేవలేదు. దీంతో సమయానికి వైద్యం అందక బాధితుడు స్ట్రెచర్‌పైనే కన్నుమూశాడు. లాలా లజపతి రాయ్ మోమోరియల్ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్న ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రసారం కావటంతో.. ఉన్నతాధికారులు ఇద్దరు వైద్యులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మీరట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతడ్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ఏసీ వేసుకొని కుర్చీలోనే నిద్రిస్తుండటం కనిపించింది. బాధితుడి భార్య డాక్టర్ దగ్గరికి వెళ్లి నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అతడు ఎంతకీ నిద్రలేవకపోవటం, మరోవైపు వైద్యం అందక రక్తస్రావం జరగటంతో సునీల్ కన్నుమూశాడు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యుడు.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగిని పట్టించుకోకపోవటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.