Shashi Tharoor : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) మరణశిక్ష విధించడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. హసీనాకు మరణశిక్ష విధించడం చాలా ఆందోళనకరమని పేర్కొన్నారు.
థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. హసీనాకు మరణశిక్ష విధించడం సరైందని తాను భావించడం లేదన్నారు. ఏ కేసులో అయినా ప్రతిఒక్కరికీ తమను తాము సమర్థించుకుంటూ వాదించే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఇలాంటి మరణశిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. వేరే దేశానికి చెందిన న్యాయవ్యవస్థ, అంతర్గత విషయాలపై తాను వ్యాఖ్యానించడం సరైనది కాదని, కానీ తాజా తీర్పు చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు.
గత ఏడాది బంగ్లాదేశ్లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఇది చివరకు దేశవ్యాప్త తిరుగుబాటుకు దారితీసింది. ఈ నిరసనల నేపథ్యంలో హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. అనంతరం బంగ్లాలో మహ్మద్యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
స్వదేశంలో జరిగిన ఆందోళనలను అణిచివేసేందుకు హసీనా అమానవీయంగా వ్యవహరించారని ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన ఐసీటీ.. హసీనాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో హసీనాను తమకు అప్పగించాలంటూ యూనస్ ప్రభుత్వం భారత్కు విజ్ఞప్తి చేసింది. ఈ తీర్పును హసీనా పక్షపాతమని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు.