వీణవంక, జనవరి 21 : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలోని శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రముఖ వేద పండితులు నమిలికొండ శ్రీధర్ ఆచార్యుల వేదమంత్రోచ్ఛరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి కల్యాణాన్ని వేలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా జరిపించారు.
అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాచేపల్లి సత్యనారాయణ, ఆలయ అర్చకులు సంతోషాచార్యులు, సర్పంచ్ శ్రీరామోజు చంద్రమౌళి, మాజీ సర్పంచ్ బండ సుజాత, మాజీ ఎంపీటీసీ మూల రజిత, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.