వీణవంక, ఆగస్టు 05 : ఉపాధి కల్పించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హిమ్మత్‌నగర్ గ్రామస్తులు మంగళవారం వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామస్తులు ఇసుక లారీల మీద తాటిపత్రులు కప్పే పని కల్పించాలని కోరుతూ గ్రామ పంచాయితీ ముందు చేపట్టిన రిలేనిరాహార దీక్ష 27వ రోజుకు చేరింది. రిలేనిరాహార దీక్షలో భాగంగా మంగళవారం గ్రామస్తులంతా కలిసి రోడ్లపై టెంట్లు వేసి వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లపైనే వంటలు చేసి, భోజనాలు చేశారు.
గ్రామంలోని ఆంజనేయస్వామి, పోచమ్మ దేవాలయాలకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్తున్న ఇసుక లారీలపై తాటిపత్రులు కప్పే అవకాశం కల్పించాలని 27వ రోజు రిలేనిరాహార దీక్షలో భాగంగా గ్రామస్తులం అందరం కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, సమస్య పరిష్కారమయ్యేవరకు రిలేనిరాహార దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా హిమ్మత్‌నగర్ గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు, తదితరులు పాల్గొన్నారు.