హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన వ్యాన్‌గార్డ్ కంపెనీ..దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి వ్యాన్‌గార్డ్ ప్రతినిధుల బృందం..రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కంపెనీ సీఈవో సలీం రామ్‌జీ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్న జీసీసీ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు, భవిష్యత్తులో ఈ సెంటర్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
వచ్చే నాలుగేండ్లలో ఈ సెంటర్లో 2,300 నుంచి 2,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో ఇందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిషరణలకు అనుకూలమైన వాతావరణముందని సలీం అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగివున్న సంస్థ..అంతర్జాతీయంగా 50 మిలియన్లకు పైగా పెట్టుబడిదారులకు తమ సేవలు అందిస్తుంది.