నల్లగొండ ప్రతినిధి, మే 14(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన ‘వచ్చామా! వెళ్లామా? అన్న రీతిగా సాగిందని రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై నిత్యం రైతుల తిరుగుబాటు, ఆందోళనల నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు కాంగ్రెస్ సర్కార్ ఉపక్రమించింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో సమీక్ష అనంతరం మంత్రులు జిల్లాల బాటపట్టారు. దీనిలో భాగంగా గురువారం నల్లగొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పర్యటించారు. నల్లగొండ పట్టణానికి ఆనుకుని కూడా చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కానీ వీటిన్నింటినీ కాదని 20 కిలోమీటర్ల దూరంలోని కనగల్ మండలం చెట్లచెన్నారం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ముగ్గురు మంత్రులు సందర్శించారు.
30కి పైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో మంత్రులు వెళ్లారు. అధికారులు నిర్దేశించిన కేంద్రాన్నే వారు సందర్శించారు. అక్కడికి వెళ్లేసరికి ఆరు లారీల్లో ధాన్యం లోడింగ్ చేస్తూ కనిపించాయి. సాధారణ రోజుల్లో రోజుకు ఒక్కలారీ వస్తేనే అక్కడ గగనమని రైతులు చెప్పారు. కానీ మంత్రుల రాకతో ఎక్కువ లారీలను పెట్టి అధికారులు షో చేశారని రైతులు వాపోయారు. అక్కడ మంత్రులు రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించనేలేదు. ముందే ఎంపిక చేసిన ఓ రైతును పిలిచి ఎప్పుడు కాంటా అయిందని మాత్రమే అడిగి వదిలేశారు. ఇంతలోనే కలెక్టర్, ఇతర అధికారులు జోక్యం చేసుకుంటూ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్‌ను వివరించారు. అనంతరం అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టెంట్లో మీడియాను, స్థానికులను ఉద్దేశించి మంత్రులు ప్రసంగింగి వెళ్లిపోయారు. కానీ అక్కడ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నమే చేయలేదు. ఒక్క రైతు కూడా తమ ఇబ్బందులు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించలేదు. ఇంతదూరం వచ్చినందుకు క్షేత్రస్థాయిలో వస్తున్న ఇబ్బందులు, ఆటంకాలపై దృష్టి సారిస్తే బాగుండేదని రైతుల అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు సమావేశం దృష్టికి తేవాలని భావించారు. కానీ, వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.
యాసంగిలో 80-90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. చివరి గింజవరకు కొనుగోళ్లు కొనసాగుతాయని తెలిపారు. లారీల సమస్యను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న అన్ని లారీలు, డీసీఎంలను ధాన్యం లోడింగ్‌కు మళ్లించేలా అధికారులకు ఆదేశాలిస్తున్నట్టు చెప్పారు. మిల్లుల్లో సైతం వెంటవెంటనే అన్లోడింగ్ జరిగేలా ప్రతి మిల్లుకూ ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ నెల 25 వరకు కొనుగోళ్లు పూర్తిచేసేలా ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పతి వచ్చిందని, అందుకే కొనుగోళ్లల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 35 శాతమే కొనుగోలు చేసినట్టు ఒప్పుకొన్న మంత్రి, మిగతాది మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని ప్రకటించడం గమనార్హం.