హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పరీక్ష విధానంలో సంస్కరణలు తెచ్చింది. ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా, ఇకనుంచి ఫస్టియర్‌లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిని 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలుచేయాలని నిశ్చయించింది. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ నిర్వహించడమే కాకుండా, లాంగ్వేజెస్, గణితం, ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో ఇంటర్నల్స్‌ను ప్రవేశపెట్టారు.
ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు గురువారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సైన్స్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు సెకండియర్‌లో మాత్రమే 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఈ మార్కులను రెండు సంవత్సరాలకు విభజించారు. ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. పస్టియర్, సెకండియర్‌లో థియరీకి 60 మార్కులుంటాయి. గణితంలో ప్రాక్టికల్స్ నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. దీని స్థానంలో కొత్తగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ (ఏబీఎల్), ఇంటర్నల్ అసెస్మెంట్ను ప్రవేశపెట్టారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఇవి ఉంటాయి. ఇదివరకు గణితంలో ఇంటర్నల్స్ లేవు.
గణితంలో ప్రాక్టికల్స్‌కు మార్కులు కేటాయించడంతో ఫస్టియర్, సెకండియర్‌లో థియరీ మార్కులు 75 నుంచి 60కి తగ్గించారు. ఫస్టియర్, సెకండియర్‌లోనూ 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. గణితం-ఏ, గణితం-బీ రెండింటికీ 15 మార్కులుంటాయి. హ్యూమానిటీస్ (కామర్స్, అకౌంటెన్సీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు) ఇంటర్నల్ అసెస్మెంట్కు 20 మార్కులు, థియరీకి 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇది వరకు 100 మార్కులకు థియరీ పరీక్షలు నిర్వహించే వారు. తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం సబ్జెక్టులకు ఇప్పటివరకు ఇంటర్నల్స్ అసెస్మెంట్ లేదు.
100 మార్కులకు పరీక్ష నిర్వహించే వారు. ఇకనుంచి 20 మార్కులకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ (ఏసీఎల్) అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టారు. దీనికి కూడా 20 మార్కులకు ఇంటర్నల్స్, 80 మార్కులకు థియరీ పరీక్షలుంటాయి. ఇంటర్ ఎంఈసీ గ్రూపులోని విద్యార్థులకు ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చే గణితం ప్రశ్నపత్రాన్నే ఇచ్చేవారు. ఈ పేపర్ కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఇకనుంచి వీరికి ప్రత్యేక ప్రశ్నపత్రం ఇస్తారు. ఈ సబ్జెక్టుకు సైతం 20 మార్కులు ఇంటర్నల్స్, 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది.
ఇంటర్ ఫస్టియర్ కోసం కొత్త పాఠ్యపుస్తకాలను ఇంటర్‌బోర్డు సిద్ధం చేసింది. బోర్డు నియమించిన నిపుణుల కమిటీ ఈ పుస్తకాలను సిద్ధంచేసింది. ఈ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముంద్రించారు. ఈ పుస్తకాల్లో చిత్రాలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ వంటి ఆధునిక అంశాలు పొందుపరిచారు. జూన్ 1లోపు కొత్త పుస్తకాలు పంపిణీ చేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈసారి ఇంగ్లిష్ మీడియం పుస్తకాలను మిగతా మీడియంలోకి తర్జుమా చేసి అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.