శంషాబాద్ రూరల్, మే 14 ః కూతురు వివాహం వైభవంగా చేసి అత్తారింటికి పంపించి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన తండ్రి 24 గంటలు గడవక ముందే కన్నతండ్రి లేడనే విషయంతో ఆ కూతురే కాదు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన శంషాబాద్లో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్కారం గ్రామానికి చెందిన కర్నె సురేందర్(48) భార్య సునంద దంపతులు.
వారికి ముగ్గురూ అమ్మాయిలే. ముగ్గురు కూతుర్లను సమానంగా పెంచుతూ ఎవ్వరికి తక్కువ కాకుండా చూశాడు. వ్యవసాయమే జీవనాధారం. ముగ్గురు కూతుర్లలో పెద్దకూతురు లాస్య(పావని)వివాహం చేసి ఆమెను అత్తారింటికి పంపించాలనే అలోచనతో ఇబ్రహింపట్నం ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్కు ఇచ్చి నర్కూడ గ్రామ సమీపంలోని మహాలక్ష్మి పంక్షన్హాల్లో బుధవారం వివాహం జరిపించారు. ఆదే రోజు సాయంత్రం కూతురుని అత్తారింటికి సాగనంపిన ఆయన గురువారం ఉదయం తన వ్యవసాయ పొలానికి అతడి బంధువుతో కలిసి వెళ్లాడు.
అతడి బంధువు పాలు తీస్తుండగా సురేందర్ ఒక్కసారిగా గుండెలో నొప్పి నొప్పి అంటూ కిందపడిపోయాడు. అక్కడే ఉన్న బంధువు దగ్గరకు వెళ్లి చూడగా ఉలుకూ పలుకూ లేకుండాపడిపోయాడు. వెంటనే అతడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని 108కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.