Layoffs : అమెరికా (USA) లో ఉద్యోగాల కుదింపు జరుగుతోంది. విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. 1300 మందికిపైగా దౌత్యాధికారులను తొలగించేందుకు సిద్ధమైంది. ఆ జాబితాలో 1107 మంది సివిల్ సర్వెంట్లు, స్థానికంగా పనిచేస్తున్న 246 మంది దౌత్యవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. వారందరికీ లేఆఫ్ నోటీసుల జారీ మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లను 120 రోజులపాటు సెలవుల్లో ఉంచనున్నారని, ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిసింది. వారిలో చాలామందికి 60 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యాలపై దృష్టి పెట్టామని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ యంత్రాంగం ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతోపాటు వారి మిత్రపక్షాలు ప్రశంసిస్తున్నప్పటికీ.. ప్రస్తుత, మాజీ దౌత్యవేత్తలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని తాజా చర్యలు బలహీనపరుస్తాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
కాగా విదేశాంగ శాఖలో ఉద్యోగాల కోతలను నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారిన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశీ సేవలందించే ఈ విభాగానికి అంతరాయం కలిగించడం జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై ప్రభావం పడుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు టామ్ యజ్డ్గెర్డీ అభిప్రాయపడ్డారు.
అయితే అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా పెద్దఎత్తున ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ యంత్రాంగం తొలగిస్తోంది. ఇప్పటికే యూఎస్ ఎయిడ్, రెవెన్యూ సర్వీసెస్తోపాటు అనేక విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.