Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఆ దేశంతో జరుగుతోన్న చర్చలపై తమకు నమ్మకం లేదని, వారు ఎప్పుడూ తనకు అబద్ధాలే చెబుతారని అన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై సంపూర్ణ నియంత్రణ అమెరికాకే ఉందని అన్నారు. ప్రస్తుతం జలసంధి తమ అధీనంలోనే ఉందని చెప్పారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గినా, దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధిలో ఒమన్ వద్ద ఓ నౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్ రేవులపై తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. పనామా జెండా కలిగిన ‘వేలా నోవా’ కార్గో నౌకపై నేవీ హెలికాప్టర్ రెండు హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడిలో సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అనే విషయాన్ని వెల్లడించలేదు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పనామా కాల్వలో నౌకల రద్దీ పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ఎల్నినో ప్రభావంవల్ల కాలువలో నీటి మట్టం తగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. దాంతో దానిగుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి పనామా కాలువ అథారిటీ నాలుడు మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిపాయి. ఓ భారీ నౌక పనామా దాటాలంటే 10 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది.