వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్జి వీడియోను ట్రూత్ సోషల్‌లో ఉంచారు. ఆలస్యం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పశ్చిమం నుంచి కారజ్ నగరాన్ని కలిపే ఈ బ్రిడ్జి ఎత్తు 136 మీటర్లు. పశ్చిమాసియాలో ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని పేర్కొనేవారు.
జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ స్థావరంలోని అమెరికా ఫైటర్ జెట్లపై తాము డ్రోన్ దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. జోర్డాన్ బేస్‌లో అమెరికా విమానాలు నిలిపి ఉంచగా ఈ దాడి జరిగింది. అయితే విమానాలకు ఎంత నష్టం వాటిల్లినదీ వివరాలు తెలియరాలేదు. గల్ఫ్‌లో పౌర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు పేర్కొన్నది. తమ దాడులను మరింత విస్తరిస్తామని, అందులో భాగంగా, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, జోర్డాన్‌లో పలు బ్రిడ్జిలు లక్ష్యంగా తమ మిలిటరీ దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది.
హొర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు 35 దేశాల ప్రతినిధులతో జరిగే బహుపాక్షిక చర్చల్లో పాల్గొనాలని యూకే నుంచి భారత్‌కు ఆహ్వానం అందినట్టు విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ సమావేశానికి భారత్ నుంచి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ ప్రతిష్ఠంభన, దానిని తెరిపించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.