వాషింగ్టన్, ఏప్రిల్ 2: ఇరాన్‌పై యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. హొర్ముజ్‌ను తెరువకపోయినా యుద్ధం ముగించేస్తామని ఒకసారి, హొర్ముజ్‌ను తెరిచేవరకూ దాడులు చేస్తామని మరోసారి ప్రకటనలు చేసిన ట్రంప్.. తాజాగా యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామని ప్రకటించారు. ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలు దాదాపు పూర్తి కావస్తున్నందున అమెరికా దళాలు తమ బాధ్యతను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన నెల రోజులు దాటిన తర్వాత మొదటిసారి బుధవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ యుద్ధానికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అమెరికా సైనిక ఆపరేషన్ విజయవంతమైందని సగర్వంగా ప్రకటించిన ట్రంప్ అమెరికా లక్ష్యాలు దాదాపు నెరవేరాయని, కొన్ని అంతకుమించి సాధించామని చెప్పారు. స్వల్ప కాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. రానున్న రెండు, మూడు వారాల్లో ఇరాన్‌ను భారీ స్థాయిలో దెబ్బతీయనున్నామని ఆయన వెల్లడించారు.
ఎక్కడ నుంచి వచ్చారో అదే రాతి యుగానికి వారిని పంపించి వేస్తామని ట్రంప్ చెప్పారు. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో ఇటీవలి రోజుల్లో చెప్పిన విషయాలనే ఆయన మళ్లీ వల్లెవేశారు. ఇరాన్ విషయంలో అమెరికా సైన్యం హద్దులు దాటిందని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నట్లు పోలింగ్‌లు చూపిస్తున్న తరుణంలో, గ్యాస్, చమురు ధరలు అధికంగా ఉన్న వేళ ట్రంప్ ప్రసంగం ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపించకపోవడం విశేషం. యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికులను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తాము లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నట్లు ఆయన ఇరాన్‌పై సైనిక చర్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్‌పై భూతల యుద్ధానికి సైనిక బలగాలను పంపడం, హొర్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో సాయపడేందుకు నాటో కూటమి ముందుకు రాకపోవడం వంటి విషయాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. అంతేగాక ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు, ఆ దేశానికి విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగియనుండడం గురించి కూడా ఆయన మాట్లాడలేదు.
అమెరికా జోక్యం చేసుకున్న గత యుద్ధాలు ముగియడానికి పట్టిన కాలాన్ని ఆయన అమెరికన్లకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ యుద్ధం మొదలై 32 రోజులు మాత్రమే అయిందని ఆయన చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం ఒక ఏడాది, ఏడు నెలల, ఐదు రోజులు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం మూడు సంవత్సరాల, ఎనిమిది నెలల, 25 రోజులు జరిగింది అని ట్రంప్ చెప్పారు. కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గడచిన నాలుగు వారాలుగా మన సాయుధ దళాలు యుద్ధభూమిలో వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, అఖండమైన విజయాలను సాధించాయని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా సైనిక చర్యను శక్తివంతమైనదిగా, అద్భుతమైనదిగా ఆయన అభివర్ణించారు. శుద్ధిచేసిన యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు తాము ఇరాన్‌కు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. మేము బీ-2 బాంబర్లతో ధ్వంసం చేసిన అణు స్థావరాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయంటే ఆ అణు ధూళి సమీపానికి చేరుకోవడానికి నెలల సమయం పడుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ధ్వంసమైన అణు స్థావరాలపై నిరంతర ఉపగ్రహ నిఘా పెట్టామని, యురేనియంను తరలించడానికి ఏ విధమైన ప్రయత్నం జరిగినా మళ్లీ దాడులు చేస్తామని ఆయన చెప్పారు. హొర్ముజ్ జలసంధి గుండా సరఫరా అయ్యే చమురు ఆధారపడిన దేశాలు ధైర్యాన్ని కూడదీసుకుని అక్కడి నుంచి తామే తెచ్చుకోవాలని ట్రంప్ చెప్పారు.