పారిస్ : యుద్ధంలో తమతో కలిసి రావటం లేదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌పై నోరుపారేసుకున్నారు. గత ఏడాది మేలో మాక్రాన్ సతీమణి బ్రిగెట్టి మాక్రాన్.. ఆయన చెంపపై కొట్టిందంటూ వెలువడిన వీడియో ఒకటి సంచలనం రేపింది. దీన్ని గుర్తుచేస్తూ ట్రంప్ తాజాగా అధ్యక్షుడు మాక్రాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మాక్రాన్‌కు దవడ దెబ్బ ఇంకా తగ్గినట్టు లేదు’ అంటూ ఎగతాళి చేశారు. బ్రిగెట్టీ మాక్రాన్ తన భర్త పట్ల దారుణంగా ప్రవర్తించారని అన్నారు. ఇరాన్ యుద్ధంపై మాక్రాన్‌తో ఫోన్లో మాట్లాడిన వెంటనే ట్రంప్ నోటి నుంచి దూషణపర్వం మొదలైంది. ఫ్రెంచ్ యాసలో మాక్రాన్‌ను వెక్కిరిస్తూ పై కామెంట్స్ చేశారు.
దీనిపై మాక్రాన్ స్పందిస్తూ, అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్ టూమచ్‌గా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు హుందాగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని విమర్శించారు. విపక్ష పార్టీలు సైతం ట్రంప్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. ప్రపంచం సంక్షోభం ముంగిట ఉన్నవేళ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షురాలు యాల్ బ్రాన్ పైవెట్ మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని విపక్ష పార్టీ ‘అన్బోవ్డ్’కు చెందిన నేత బాంపర్డ్ అన్నారు.