ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలు తగ్గడం లేదు. యూరియా కోసం రైతులు పొద్దంతా నరకయాతన పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే సొసైటీ లు, రైతువేదికలు, ఫర్టిలైజర్ షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆకలి దప్పులు మరిచి అరచేతిలో ఆధార్, పాస్ బుక్ ప్రతులు పట్టుకొని క్యూలో తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని సొసైటీల్లో రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో కూపన్లు ఇచ్చి సరిపెడుతుండగా.. మరికొన్ని కేంద్రా ల్లో ఉన్న వరకు పంపిణీ చేసి మరుసటి రోజు రమ్మంటున్నారు. దీంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధారూరు, సెప్టెంబర్ 16 : మండలంలోని కెరెళ్లి రైతువేదిక, ధారూరు రైతు వేదికల వద్ద అన్నదాతలు మంగళవారం ఉదయం నుంచే వందలాదిగా ఆధార్ కార్డులు, పాస్బుక్కులతో క్యూలో నిరీక్షించారు. గంటల తరబడి నిలబడినా సరిపడా యూరియా అందకపోవడంతో అసహ నం వ్యక్తం చేశారు. ధారూరులో స్టాక్ తక్కువగా ఉండగా.. ఎక్కువ మంది రైతులు వచ్చి క్యూలో ఉండగా.. పోలీస్ పహారాలో కొందిమందికే పంపిణీ చేశారు. మిగిలిన క్యూలో ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి సిబ్బంది వారికి టోకెన్లు ఇచ్చారు. యూరియా లోడ్ రాగానే ముందుగా మీకే పంపిణీ చేస్తామని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అన్నదాత ఇబ్బందులను గుర్తించి.. సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దొరికింది రెండు బస్తాలే ..
బంట్వారం : గంటల తరబడి క్యూలో నిలబడితే దొరికింది రెండు బస్తాల యూరియా మాత్రమేనని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం బంట్వారం పీఏసీఎస్‌కు యూరియా లోడ్ రావడంతో రైతులు అక్కడికి అధికంగా రావడంతో కొంతసేపు తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది పోలీస్ పహారాలో రైతులకు యూరియాను పంపిణీ చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు లైన్లో నిలబడలేక తిరిగి ఇండ్లకు వెళ్లి పోయారు. 30 రోజులు దాటినా యూరియా తిప్పలు ఎప్పుడు తప్పుతాయోనని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
జాతీయ రహదారిపై అన్నదాతల ఆందోళన
మొయినాబాద్ : మొయినాబాద్‌కు మంగళవారం 300 బస్తాల యూరి యా రావాల్సి ఉండగా 150 బస్తాలే వచ్చాయి. యూరియా వచ్చిన విష యం తెలుసుకున్న రైతులు టోకెన్లు తీసుకుని మండల కేంద్రంలోని బాలా జీ ఫర్టిలైజర్ షాపు వద్దకు పరుగులు తీశారు. క్యూలో ముందున్న వారికే ఎరువు అందింది. మిగిలిన వారికి అందకపోవడంతో ఆందోళనకు దిగా రు. యూరియా స్టాక్ తక్కువగా రావడంతో ముందున్న వారికే పంపి ణీ చేశామని, మిగిలిన వారికి రెండు రోజుల్లో వచ్చే స్టాక్ నుంచి పంపిణీ చేస్తామని చెప్పడంతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి వారిని సముదాయించారు.
తప్పని యూరియా తిప్పలు
ఆమనగల్లు : మండల కేంద్రంలోని వాసవి ఫర్టిలైజర్ షాప్ ఎదుట రైతులు ఉదయం నుంచే యూరియా కోసం బారులుదీరారు. గంటల తరబడి నిలబడినా సరిపడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టదా..?
కడ్తాల్, సెప్టెంబర్ 16 : రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామంతోపాటు పరిసరా గ్రామాల రైతులకు సరిపడా యూరియా పం పిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హాజరై మాట్లాడారు. వానకాలం ముగుస్తున్నా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడంలేదన్నారు.
పీఏసీఎస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ, గట్టుఇప్పలపల్లి గోదాముకు రావాల్సి న యూరియాను వేరే గ్రామాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ఉన్న విషయాన్ని తెలుసుకున్న పీఏసీఎస్ అధికారులు హడావుడిగా కొంతమందికి టోకెన్లు పంపిణీ చేశారన్నారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతులు ఎరువుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పడలేదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ శిరీషాకృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ నర్సింహ, మాజీ సర్పంచ్‌లు జయమ్మావెంకటయ్య, విజయ్‌రెడ్డి, రమేశ్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామాధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు జంగయ్య, శరత్‌చంద్రశర్మ, కృష్ణయ్య, అశోక్‌గౌడ్, శరత్, ఆంజనేయులుగౌడ్, రాజు, రవీందర్, కొండల్, మల్లేశ్, చంద్రశేఖర్, రత్నయ్య, పర్వత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.