BRS Leader Yadava reddy | రాయపోల్, ఆగస్టు 20 : రైతులకు సమయానికి యూరియా బస్తాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని దౌల్తాబాద్ మండల మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సరు గారి యాదవ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటే రైతులకు యూరియా కొరత సృష్టించడమేనా అని ఆయన ప్రశ్నించారు.
వర్షాలు కురువడంతో రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎంతో అవసరమని.. కానీ వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వలన రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదన్నారు. దౌల్తాబాద్ మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుందని.. వారం రోజులు గడుస్తున్నా యూరియాను రైతులకు అందించడంలో అధికారులు వైఫల్యం చెందడం దారుణమని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. రైతుల పట్ల వారికి ఉన్న ప్రేమ అర్థమవుతుందని పేర్కొన్నారు.
వానకాలం సీజన్లో రైతులు ఎంత మేరకు పంటలు వేశారో వాటి అంచనాల నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడంలో వ్యవసాయ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఎనుకటి రోజులు రోజులు వచ్చాయని.. రెండు బస్తాల యూరియా కోసం క్యూలైన్లు, ధర్నాలు, రాస్తారోకోలు, చెప్పులు, పట్టా పాస్ బుక్కులు లైన్లో పెట్టడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఆచరణకు మించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వరగబెట్టింది ఏమీ లేదన్నారు.
కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు యూరియా కొరత ఉంటే ఏ ఒక్క నాయకుడు రైతుల పక్షాన మాట్లాడకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలపై ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కోటి ఎకరాల మాగానికి సాగునీరు అందించాలని సంకల్పంతో ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవనాధారం అని.. ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సశ్యామలం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని రైతులు రాజకీయ సమాధి చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా రైతులకు యూరియా సరఫరా చేయాలని.. లేని పక్షంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు.
Constitution Amendment Bill: పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు : విపక్షాల ఆరోపణ
Rajapeta : రాజాపేట చెరువుల్లోకి చుక్కనీరు రాలే
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని రైతుల ధర్నా