వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు. తమ వంతు కోసం లైన్లలో వేచి ఉన్నారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తుండటంతో సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రైతువేదిక వద్దకు చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. అనంతరం పోలీసు పహారాలో ఎరువుల పంపిణీ ప్రారంభించారు. అయితే పది ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని విమర్శించారు.