బయ్యారం, ఆగస్టు 23 : ఇల్లు వచ్చిందని సంతోషపడ్డ గిరిజన ప్రజలు తీరా మొదలు పెట్టుకుందామనే సరికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో తమ ఇల్లయ్యేదెప్పుడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొయ్యగూడెం పంచాయతీ పరిధిలోని చుంచుబంధం తండాలో 2, సుద్దరేవులో 3, కొయ్యగూడెం గ్రామంలో 14 ఇండ్లు మంజూరు చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఇల్లు వచ్చిందనే సంతోషంతో కట్టుకునేందుకు గిరిజన ప్రజలు సిద్ధమయ్యారు.
అధికారులు సైతం 18 ఇండ్ల నిర్మాణం కోసం జూలై మొదటి వారంలోనే ముగ్గు పోశారు. ఏజెన్సీ గ్రామంలో సిగ్నల్ సమస్య ఉండడంతో ముగ్గు పోసిన అనంతరం టీజీహెచ్సీఎల్ యాప్‌లో ఆఫ్‌లైన్‌లో ఇంటి వివరాలు పొందుపరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తి ఇంటికి సంబంధించిన ఫొటో అప్లోడ్ కావడం లేదు. ఆరుగురు లబ్ధిదారులు పిల్లర్ల కోసం గుంతలు కూడా తీశారు. చాలా సార్లు ప్రయత్నించినా క్యాప్చర్ కాకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు ఇండ్ల నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని లబ్ధిదారులను సూచించారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలరోజులైనప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల కొందరు లబ్ధిదారులు కలెక్టరేట్‌కు వెళ్లి తమ గోడును వెల్లబోసుకున్నారు. తాము ఇల్లు కట్టుకుంటామా .. లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉన్న చిన్నపాటి ఇంటిని కూలగొట్టుకొని రేకుల ఇంట్లో ఉంటూ అవస్థలు పడుతన్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై హౌసింగ్ ఏఈ ప్రవళికను వివరణ కోరగా సాంకేతిక సమస్య తలెత్తిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.