హుస్నాబాద్, నవంబర్ 27: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సొంత రాష్ట్రం కలను నిజం చేయడమే కాకుండా ప్రజలు కలలుగన్నట్టుగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చినట్టు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీగా దేశంలోనే ప్రథమ స్థానం పొంది జాతీయ స్థాయి అవార్డు దక్కించుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు.