Jitendra Singh : లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆమోదం పొందిన మరుసటి రోజే రాజ్యసభకు ఈ బిల్లు రావడం విశేషం. విద్యార్థులు, యువత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేందుకు ఈ బిల్లే నిదర్శనం అని మంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్, 2026 (యాంటీ పేపర్ లీక్ లా) పేరుతో ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. ఈ బిల్లుపై లోక్‌సభలో రెండురోజులపాటు దాదాపు 10 గంటలకుపైగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పటికీ బిల్లు ఆమోదం పొందిందన్నారు. అలాంటి బిల్లును సీనియర్లు, మేధావులు ఉన్న పెద్దల సభకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల్ని ఉన్నతంగా కాపాడేందుకే, వారి సంక్షేమానికే తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఇదని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రతిపాదిత బిల్లుపై చర్చించాలని ఆయన రాజ్యసభ సభ్యులను కోరారు. పేపర్ల లీకులను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వీటిని సహించేది లేదన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేయబోమన్నారు. ఈ బిల్లును రూపొందించేందుకు ప్రధాని ఏమాత్రం ఆలస్యం చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పారదర్శకత కోసమే ఈ బిల్లు తెచ్చామన్నారు. ప్రతిపక్షాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నాలుగు ప్రధానమైన నియామక, పరీక్షల నిర్వహణ సంస్తలు ఉన్నాయని వివరించారు. అవి యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్టీయే అని చెప్పారు.
ఎన్టీయేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ హయాంలో 1992లో వచ్చిందన్నారు. ఆ తర్వాత దీని ఏర్పాటును పలు కమిటీలు సమర్ధించగా, చివరకు 2010లో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ అంశంలో మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేస్తున్నందుకు ప్రతిపక్షం తమను అభినందిస్తుందని భావిస్తున్నట్లు మంత్రి అన్నారు. ఈ సవరణ బిల్లు ప్రకారం పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.