న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మునుపటి చర్చల ద్వారా పొందిన ప్రయోజనాలు క్షీణించవచ్చునని పేర్కొన్నది. గతంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న దేశాలు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి రావచ్చని, సమగ్ర ఒప్పందాలు లేని దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన స్థితిలో ఉండవచ్చునని ఈ నివేదిక తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్ లాంటి దేశాలకు తీవ్ర నష్టమని, ఆ తీర్పు వల్ల లభించే ప్రయోజనాలు మనకు బదిలీ కావని, ముందస్తుగా మనం చేసుకున్న ఒప్పందం వల్ల నష్టమే మిగులుతుందని పలువురు వాదిస్తున్న క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై నివేదిక సమర్పించింది.